No Facilities In Govt Degree College At Sangareddy : సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ మండలం పెద్దచింతకుంటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Govt Degree College) పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఒకపక్క గదుల కొరత మరో పక్క అపరిశుభ్రత విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 2017లో నర్సాపూర్‌కు డిగ్రీ కళాశాల మంజూరైంది. అధికారులు కొన్నేళ్లు అద్దె భవనాల్లో కళాశాలను నడిపించారు. తర్వాత మండలంలోని పెద్దచింతకుంటలో దాదాపు నాలుగు ఎకరాల భూమిని కాలేజీ నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించడంతో గుత్తేదారులు శరవేగంగా నిర్మాణాలు ప్రారంభించారు.
Peddachintakunta Degree College Students Problems : ఆ భవనాలు పూర్తిస్థాయిలో నిర్మాణం కాకుండానే విద్యార్థులను ఇక్కడికి తరలించారు. కానీ వారికి సరిపడా గదులు లేక నూతనంగా 40 లక్షల రూపాయలతో అదనపు గదులు నిర్మాణానికి గుత్తేదారులు పనులు ప్రారంభించారు. నిధులు ముంజూరులో జాప్యం కారణంగా అవి మధ్యలోనే ఆగిపోయాయి. తెలుగు, ఆంగ్ల మాద్యమాలలో 252 మంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు.
అసంపూర్తిగా వదిలేసిన ఆ గదుల్లోనే అధ్యాపకులు చదువులు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు. కాలేజీలో తరగతి గదులు, తాగు నీరు, మరుగు దొడ్ల సమస్యలు తమను వెంటాడుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. కుర్చోవడానికి బెంచీలు సైతం సరిపడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఓ పక్క వానరాలు, మరో పక్క శునకాలు.. కళాశాల ఆవరణంలో స్వైరవిహారం చేస్తున్నాయి.
భోజనాలు చేసే సమయంలో తమ మధ్యలోకి వచ్చి వానరాలు హల్‌చల్ చేస్తున్నాయని పేర్కొన్నారు. తరగతి గదుల పక్కనే ముళ్లపొదలు అల్లుకుపోవడంతో విషసర్పాలు సైతం సంచరిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ కళాశాలలో ఇన్ని ఇబ్బందులు ఉండటంతో కొత్తగా ఇక్కడ చేరడానికి కూడా విద్యార్థులు మక్కువ చూపడంలేదు. కళాశాల ముందు వాహనాల అదుపు కోసం ఎటువంటి నియంత్రికలు లేకపోవడంతో విద్యార్థులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు.
"పెరిగినటువంటి కోర్సులను దృష్టిలో పెట్టుకొని సరిపడా తరగతి గదులు అందుబాటులో లేవు. నార్త్ సైడ్ ఉన్నటువంటి బ్లాక్ అసంపూర్తిగా ఉంది. అది పూర్తి అయితే లైబ్రరీ, ల్యాబ్‌కు అనుకూలంగా ఉంటుంది. మౌలిక వసతుల కల్పన విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాను." - దామోదర్, కళాశాల ప్రిన్సిపల్
గ్రామానికి సర్పంచ్.. స్కూల్లో టీచర్.. చిన్నారుల విద్య కోసం మహిళ మల్టీటాస్కింగ్
కళాశాల ప్లే గ్రౌండ్లో దట్టంగా గడ్డి మొక్కలు పేరుకుపోవడంతో నడవడానికి కూడా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కళాశాల ప్రాంగణం పక్కనుంచి కొందరు వ్యక్తులు గుడిసెలు వేసుకొని ఆక్రమించుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఈ విషయాన్ని స్థానికి మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు కళాశాల ప్రధానాచార్యులు తెలిపారు. తమ ప్రాంతంలోనే డిగ్రీ కళాశాల ఉండటంతో ఎంతో ఆనందంతో ఊర్లోనే చదువుకోవచ్చు అనుకున్న విద్యార్థుల ఆశలపై నిర్లక్ష్యం వేళ్లూరుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కళాశాలలో మౌలిక వసతులు కల్పినకు కృషి చేయాలని విద్యార్థులు కోరుతున్నారు
78 ఏళ్ల వయసులో స్కూల్‌కు.. బ్యాగు, యూనిఫాంతో రోజూ 3కి.మీ నడక.. లక్ష్యం అదేనట
56 ఏళ్ల వయసులో పట్టువదలని విక్రమార్కుడు- 23ప్రయత్నాల తర్వాత సెక్యూరిటీ గార్డ్ డబుల్ పీజీ