తెలంగాణను మొదటి నుంచి వ్యతిరేకించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajashekar reddy) వారసులమని చెప్పుకుని వచ్చే వారికి ఈ గడ్డ మీద స్థానం లేదని ఆర్థిక మంత్రి హరీశ్ రావు(Harish rao) స్పష్టం చేశారు. తెలంగాణ కోసం మాట్లాడితే వైఎస్ తమ గొంతునొక్కి అసెంబ్లీ నుంచి బయటికి పంపారని గుర్తు చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ(congress party) స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలకు తెరాస కండువా కప్పి పార్టీలోకి హరీశ్ రావు ఆహ్వానించారు.
'కుర్చీల కొట్లాట'
నాడు తాము తెలంగాణ కోసం పోరాడితే.. కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, అధిష్ఠానం మెప్పు కోసం ప్రయత్నించారని ఆరోపించారు. అవకాశవాదులకు, ఆంధ్రాతొత్తులకు ఈ రాష్ట్రంలో చోటు లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీది కుర్చీల కొట్లాట అని... వారు గాంధీ భవన్లో ఎక్కువ.. ప్రజల్లో తక్కువ అని ఎద్దేవా చేశారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా రైతులకు 24గంటల ఉచిత విద్యుత్(free electricity for farmers), రైతుబంధు(rythu bandhu), మిషన్ భగీరథ(mission bhagiratha) వంటి పథకాలు అమలులో ఉన్నాయా? అని ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించారు.
త్వరలో ఉద్యోగాలు
తెరాస(TRS) ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోందని హరీశ్ రావు స్పష్టం చేశారు. త్వరలో 50వేల ఉద్యోగాల నియామకాలు(JOBS RECRUITMENT) చేపడతామని, 57ఏళ్ల వారికి పింఛన్లు(PENSIONS) ఇస్తామన్నారు. రూ.4వేల కోట్లతో పాఠశాలల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ హయాంలో సర్కార్ దవాఖానాల్లో వైద్యులు, నర్సులే లేరు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రులను మెరుగు పరిచాం. కొత్తగా 7 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చాం. ఇప్పటికే 5 కళాశాలలు పూర్తి చేశాం. కాంగ్రెస్ హయాంలో ఆదిలాబాద్లో ఒక్క కాలేజీని మాత్రమే ఏర్పాటు చేశారు. సంగారెడ్డికి గతంలో ముఖ్యమంత్రులను తీసుకొచ్చినా... వారు ఏం ఇవ్వలేదు. సదాశివపేటలో రూ.45 కోట్లతో ఇంటింటికి నల్లా కార్యక్రమం తీసుకొస్తున్నాం. కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదానే లేదు. వాళ్లు అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారు. తెరాస పాలనలో నేడు తెలంగాణ అద్భుత విజయాలను సాధిస్తోంది.
-హరీశ్ రావు, ఆర్థిక మంత్రి
ఇదీ చదవండి: Job Vacancies in Telangana: రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలపై ఆర్థికశాఖ కసరత్తు