సంగారెడ్డి జిల్లా జోగిపేట, ఆందోల్ పురపాలికల్లో మంత్రి హరీష్ రావు హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం హరితహారం నిర్వహిస్తూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. హరిత వనాలు విస్తరించాలని.. హరిత రక్షణతోనే.. జన సంరక్షణ ఉంటుందని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో అడవులు మాయమై.. పొదలు మాత్రమే మిగిలాయని.. తిరిగి తెలంగాణ పచ్చటి అడవులతో కళకళలాడాలంటే.. ప్రతీ ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి, సంరక్షించాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పట్టణాలతో పాటు.. మారుమూల గ్రామాల్లో సైతం నర్సరీలు ఏర్పాటు చేశామని తెలిపారు.ఈ నర్సరీల ద్వారా ఆరో విడత హరితహారం కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నామన్నారు.
ఆందోల్, జోగిపేట పురపాలక పరిధిలో 1.5 లక్షల మొక్కలు నాటే లక్ష్యం నిర్దేశించుకున్నట్టు తెలిపారు. యువత, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, మహిళలు మొక్కలు నాటేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుతామో.. మొక్కలను కూడా అంతే జాగ్రత్తగా పెంచుకోవాలన్నారు. పుట్టినరోజు నాడు బహుమతిగా.. చనిపోయీన వారికి నివాళిగా ఒక మొక్కను నాటాలని, జీవనవిధానంలో మొక్కలు నాటడం ఒక భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి , పురపాలక చైర్మన్ గుడి మల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ గుప్త, పాలనాధికారి హనుమంతరావు, పురపాలక కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:వారికి స్మార్ట్ఫోన్లే లేవ్- మరి ఆన్లైన్లో చదువెలా?