సంగారెడ్డి జిల్లా లింగంపల్లి-వెంకటాపూర్ శివారులో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల సర్వే పనులకు మంత్రి హరీశ్‌రావు శ్రీకారం చుట్టారు. ఎత్తిపోతలతో సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం కానుందని.. 3.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని మంత్రి తెలిపారు. రూ.16 కోట్ల వ్యయంతో సంగమేశ్వర, 11 కోట్ల ఖర్చుతో బసవేశ్వర సర్వే పనులు జరగనున్నాయి. 60 నుంచి 70 రోజుల్లో సర్వే పనులు పూర్తిచేసి డీపీఆర్ సిద్ధం చేసేలా అధికారులను హరీశ్‌రావు ఆదేశించారు. సంగమేశ్వర ద్వారా సింగూర్ నుంచి 165 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్ చేస్తారు. చెరువులు, కుంటలు అనుసంధానిస్తూ 960 కిలోమీటర్ల మేర కాల్వల తవ్వకం చేపడతారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో సింగూర్ ప్రాజెక్టును అనుసంధానిస్తారు. సింగూర్ బ్యాక్‌వాటర్‌లో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల నిర్మాణం చేపడుతుండగా... 11 మండలాల్లో 2 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందనుంది.
ధాన్యపు భాండాగారంగా తెలంగాణ
భాజపా, కాంగ్రెస్ తీరుపైనా హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. యాసంగిలోనే 90 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొన్నామని.. తెలంగాణ దేశానికి అన్నం పెట్టే ధాన్యపు భాండాగారంగా మారిందన్నారు. రేపట్నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జమచేస్తామని.. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చినా సాయం ఆపడం లేదన్నారు. భట్టి విక్రమార్క ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కాంగ్రెస్ 88,500 ఎకరాలు అమ్మిందని.. ఇప్పుడు అడ్డుకుంటామని వ్యాఖ్యానించడాన్ని హరీశ్‌రావు తప్పుపట్టారు.
లేఖ విడుదల చేస్తాం
కేంద్ర ప్రభుత్వం తీరుపైనా హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలాగా.. పన్నులు పెంచలేదన్నారు. ఏడాదిలో 43 సార్లు పెట్రో ధరలు పెంచి భారం మోపారని విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే దేశంలో ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు. పెట్టుబడుల ఉపసంహరణపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పంపిన లేఖను విడుదల చేస్తానని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
కరోనా కాలంలోనూ ఆర్టీసీ వంటి సంస్థలకు ఆర్థికసాయం చేసి ఆదుకుంటున్నామని హరీశ్‌రావు వెల్లడించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తే పేదలకు రిజర్వేషన్ల ఫలాలు ఎలా అందుతాయని భాజపా నేతలను ప్రశ్నించారు.
ఇదీ చదవండి: etela rajender: భాజపా తీర్థం పుచ్చుకున్న ఈటల రాజేందర్