భాజపాకు గతంలో సిద్ధాంతం ఉండేదని... ప్రస్తుతం చిల్లర రాజకీయాలు చేసి ప్రజల నుంచి ఓట్లు పొందే పార్టీగా మారిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో తెరాస బూత్ స్థాయి కార్యకర్తలతో నిర్వహించిన గ్రేటర్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్, భాజపా చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని అన్నారు. పటాన్చెరులో ఐదేళ్ల క్రితం ఉన్న నీటి ఇబ్బందులను రూ.250 కోట్లు ఖర్చు పెట్టి తెరాస తీర్చిందని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చామని తెలిపారు.
అప్పుడూ ఇప్పుడూ అంతే...
తెరాస అధికారంలోకి వస్తే ప్రజల జీవితాల్లో చీకటి అవుతుందన్న కాంగ్రెస్‌లోనే చీకటి అలుముకుందని... ప్రజలకు కరెంటుతో వెలుగు వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతలతో కార్మికులు ఉపాధి కోల్పోతే... కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక 24 గంటల కరెంటుతో కొత్త పరిశ్రమలు వస్తున్నాయని, చేతినిండా పని దొరికి కార్మికులు హాయిగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ఆనాడు అధికారంలో ఉండి చేసిందేమీ లేదని... ఇప్పుడు చేయబోయేది ఏమీ లేదని దుయ్యబట్టారు.
గడపగడపకూ చేరేలా కృషి..
కేంద్రంలో ఉన్న భాజపా కరోనా టీకా బిహార్‌లో ఇచ్చాక తెలంగాణలో ఇస్తామని చెప్పిందని గుర్తు చేశారు. కరోనా వచ్చిన సమయంలో కాంగ్రెస్, భాజపా నాయకులు ప్రజల వద్దకు వచ్చారా అని ప్రశ్నించారు. వైద్యులు, అధికారులతో తాను వచ్చి ధైర్యం చెప్పానని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు గడపగడపకు చేర్చేలా తెరాస కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బూత్‌ల వారీగా బృందాలుగా ఏర్పడి... మంచి పనులు ప్రచారం చేయాలన్నారు. పటాన్చెరులో రూ.150 కోట్ల విలువ చేసే 15 ఎకరాలు భూమిని మార్కెట్ యార్డ్ కోసం తెరాస ఇచ్చిందని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: జగన్ అక్రమాస్తులపై రేపు ఈడీ కేసుల విచారణ