సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాటి గ్రామ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. కొన్ని సర్వే నంబర్లలో భూమి తమదంటూ కొంత మంది వ్యక్తులు బోర్డులు పాతేందుకు రావడం వల్ల అక్కడ ఉన్న ప్లాట్ యజమానులు (బీహెచ్ఈఎల్ విశ్రాంత ఉద్యోగులు), స్థానికులు వారిని అడ్డుకున్నారు.
పాటి గ్రామ పరిధిలో ఆనందనగర్ కాలనీలో 204, 238 సర్వే నంబర్లో సుమారు 198 మంది గతంలో ప్లాట్లు కొనుగోలు చేశారు. ఈరోజు ఉదయం కొంత మంది వచ్చి భూమి తమదేనంటూ సూచించే బోర్డు పాతేందుకు బౌన్సర్ల సహాయంతో వచ్చారు. వారికి స్థానికులు, ప్లాట్ల యాజమానులు అడ్డుకోవడం వల్ల వివాదం నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడున్నవారిని చెదరగొట్టారు. ప్లాట్ల యాజమానుల తరఫున పాటి గ్రామస్థులు వచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఇరువర్గాలను పోలీస్ స్టేషన్కు పిలిపించారు.
తాము కొనుగోలు చేసిన భూములను ఆక్రమించేందుకు కొంత మంది యత్నిస్తున్నారని ప్లాట్ల యజమానులు ఆరోపించారు. తమ ఆస్తులు, ప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీసులు, అధికారులకు విజ్ఞప్తి చేశారు.