GOVERNOR TAMILISAI: ఐఐటీ హైదరాబాద్‌లో పరిశోధకులు రూపొందించిన వైద్య పరికరాలను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవిష్కరించారు. పరిశోధకులు, విద్యార్థులు తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని ఆమె సూచించారు. సంగారెడ్డి జిల్లాలోని ఐఐటీ హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
విద్యార్థులు పరిశోధనల్లో నిమగ్నమై ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని తమిళిసై సూచించారు. పరిశోధకులు, విద్యార్థులు తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలన్నారు. మన జీవనశైలిలో రోజూ యోగాతో పాటు వ్యాయామాలు కూడా చేయాలని గవర్నర్ తమిళిసై తెలిపారు. కరోనాతో రెండేళ్లుగా ఇబ్బందులు పడ్డామని తెలిపారు. మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యులు విశేషంగా సేవలందించారని ఆమె కొనియాడారు. వైద్యరంగంలో నూతన ఆవిష్కరణలు ఎప్పుడు కొనసాగుతూనే ఉండాలని గవర్నర్ పేర్కొన్నారు.
ప్రపంచం కరోనాతో సతమతమవుతుంటే మనం వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. అందుకు కారణం మన వైద్యరంగంలో వస్తున్న ఆవిష్కరణలే. తెలంగాణ ఫార్మా పరిశ్రమకు హబ్‌గా మారింది. అదేవిధంగా మన దేశం ఫార్మాకు కాపిటల్‌గా మారింది. దాదాపు 150కి పైగా దేశాలకు మన ఔషధాలు ఎగుమతి చేస్తున్నాం. అభివృద్ధి చెందిన దేశాలు కూడా వ్యాక్సిన్లు, మందుల కోసం మనవైపు చూశాయి. మనం ఇంకా కరోనా నుంచి బయట పడలేదు. విద్యార్థులంతా పరిశోధనలపై దృష్టి సారించండి. - తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర గవర్నర్
ఇదీ చూడండి: ప్రమాణస్వీకారం చేసిన హైకోర్టు నూతన న్యాయమూర్తులు