Young Man was attacked by a mob in Hyderabad : హైదరాబాద్‌లో ఆకతాయిల అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గ్యాంగ్‌లుగా ఏర్పడి నానా హంగామా సృష్టిస్తున్నారు. అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్న వారిని ఆటపట్టించడమే కాకుండా.. పలుమార్లు దౌర్జన్యానికి దిగుతున్నారు. ఇదేంటని వారు ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. మరోవైపు డబ్బులు ఇవ్వాలంటూ అమాయకులను వేధిస్తున్నారు. ఇవ్వకుంటే వారి దగ్గర ఉన్న వస్తువులను లాక్కుని అక్కడి నుంచి ఉడాయిస్తున్నారు. దీంతో బాధితులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
Mob Attack on a young boy for mobile phone : హయత్‌నగర్ పరిధిలో ఆకతాయిలు రెచ్చిపోయారు. డబ్బులు ఇవ్వాలంటూ.. ఓ యువకుడిని తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈనాడు సంస్థలో సత్యసాయి పవన్‌కుమార్ అనే ఉద్యోగి డీటీపీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజువారిలాగే నిన్న కూడా విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలోనే రాత్రి 2.25 గంటల ప్రాంతంలో లెక్చరర్స్ కాలనీలోని తన ఇంటికి వెళ్తుండగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు గల్లీలో ఆరుగురు వ్యక్తులు బైకుపై కూర్చొని అతనిని అడ్డగించారు.
డబ్బులు ఇవ్వాలంటూ పవన్‌కుమార్‌పై దాడి : అంతటితో ఆగకుండా ఆ వ్యక్తులు డబ్బులు ఇవ్వాలంటూ పవన్‌కుమార్‌పై దాడి చేశారు. ఈ క్రమంలోనే బాధితుడి ముఖంపై పిడిగుద్దులు గుద్దారు. తన వద్ద డబ్బులు లేవని అతను చెప్పినా వారు వినలేదు. దీంతో పవన్ సాయి సెల్‌ఫోన్ గుంజుకొని ఆకతాయిలు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే కాసేపటికి తేరుకున్న పవన్.. ప్రధాన రహదారి పైకి వచ్చాడు. కారులో అటువైపు వెళ్తున్న ఇద్దరు యువకులు అతణ్ని చూసి హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.
పోలీసులు పవన్‌కుమార్ ముఖంపై గాయాలు చూసి ముందు ఆసుపత్రికి వెళ్లాలని.. తర్వాత ఫిర్యాదు తీసుకుంటామని చెప్పగా.. బాధితుడు స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాడు. అనంతరం మళ్లీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. దాడి చేసిన ముగ్గురి వ్యక్తులను పవన్‌కుమార్ గుర్తించాడు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు : మరో ముగ్గురు నిందితులను.. పవన్‌కుమార్‌కి సాయం చేసిన యువకులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. వీటి ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. పవన్‌కు.. గాయాలు కాస్త తీవ్రంగానే ఉండటంతో బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు వీధుల్లో గస్తీని పెంచాలని స్థానికులు కోరుతున్నారు. తద్వారా ఆకతాయిల ఆటలకు అడ్డుకట్ట పడతాయని వారు అంటున్నారు.
ఇవీ చదవండి : అనాథ చిన్నారులపై పాశవిక దాడి.. జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి..
మంచి బట్టలు ధరించాడని దళితుడిపై దాడి.. అడ్డొచ్చిన మహిళను సైతం..