గణపతి నవరాత్రులు వచ్చాయంటే చాలు.. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా వాడవాడనా గణేశ్ మండపాలు వెలుస్తాయి. ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ సందడి వాతావరణం నెలకొంటుంది. ఇక వినాయక ఆలయాల్లో జరిగే బ్రహ్మోత్సవాల వైభవం మాటల్లో వర్ణించలేం. రోజుకో తీరుగా ఆ గణాధిపతిని అలంకరిస్తారు.. పూజిస్తారు. అయితే ఒక్కో ఆలయంలో ఒక్కో ఆచారం ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలో నెలకొన్న స్వయంభు గణేశ్ గడ్డ గణపతి ఆలయంలో ఓ వినూత్న ఆచారం ఉంది. ఉత్సవాలు జరిగే నవరాత్రులూ ఈ విఘ్నేశ్వరుడు రోజుకో వర్ణంలో భక్తులకు దర్శనమిస్తాడు.
సాధారణంగా సింధూర వర్ణంలో దర్శనం ఇచ్చే వినాయకుడు.. నవరాత్రుల్లో మాత్రం ఆయా రోజును బట్టి.. ఆ రోజుకు అధిపతి గ్రహానికి ఇష్టమైన రంగులో దర్శనమిస్తాడు. సోమవారం చంద్రునికి ఇష్టమైన రోజు కావడంతో తెలుపు రంగులో, అన్నపూర్ణ దేవీ కటాక్షం కోసం అన్నంతో అలంకరిస్తారు. మంగళవారం గులాబి వర్ణంలో, బుధవారం ఆకుపచ్చ రంగులో, గురువారం బంగారు వర్ణంలో, శుక్రవారం గోధుమ వర్ణంలో, శనివారం శనీశ్వరునికి ఇష్టమైన నలుపు రంగులో అలంకరిస్తారు. ఆదివారం ఆ గణపయ్య తండ్రైన పరమేశ్వరునిలా అర్ధనారీశ్వరునిలా పసుపు, కుంకుమలతో అందంగా అలంకరిస్తారు.
రోజుకో వర్ణంలో దర్శనమిచ్చే ఈ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. స్వామివారిని వివిధ రూపాల్లో చూసి తరిస్తున్నారు. ఈ స్వామి ఏటికేడు పెరుగుతాడని ఇక్కడ ప్రతీతి.
ఇదీ చూడండి: Ganesh Immersion: గణేశ్ నిమజ్జన ఉత్తర్వులపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ