లాక్డౌన్ వేళ అక్రమంగా మద్యం అమ్ముతున్న పలువురు వ్యక్తులను అబ్కారీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం వెంకటేశ్వర కాలనీకి చెందిన సంతోశ్ కుమార్ తన ఇంటిముందే కారులో మద్యం సీసాలు పెట్టి విక్రయిస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న అబ్కారీ అధికారులు తనిఖీలు నిర్వహించగా... కారులో 14 మద్యం సీసాలు పట్టుబడ్డాయి. మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని కారు జప్తు చేశారు.
బండ్లగూడకు చెందిన మల్లేశం, కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు ఆటోలో భారీగా కల్లు తరలిస్తూ... ఇంద్రేశం కూడలిలో ఆబ్కారీ అధికారులకు పట్టుబడ్డారు. నిందితులను అదుపులోకి తీసుకొని కల్లు స్వాధీనం చేసుకున్నారు. ఆటోను జప్తు చేశారు. లాక్డౌన్ సమయంలో మద్యం విక్రయం, కల్లు తరలింపునకు పాల్పడిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఆబ్కారీ అధికారులు తెలిపారు.