కడుపునొప్పి భరించలేక ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు గోకుల్‌నగర్‌కు చెందిన గుడిసెల పావని కూకట్పల్లి ఎమ్మెన్నార్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తండ్రి లేకపోవటం వల్ల తల్లి అనిత రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రిలో స్వీపర్‌గా పనిచేస్తూ చదివిస్తోంది.
పావని గత కొంతకాలంగా కడపునొప్పితో తీవ్రంగా బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా... ఫలితం కన్పించలేదు. తరచూ కడుపునొప్పి రావటం వల్ల ఆ బాధ భరించలేక... పావనికి జీవితం విరక్తి వచ్చింది. కాసేపు పడుకుంటానని తన సోదరికి చెప్పి గదిలోకి వెళ్లిన పావని... ఫ్యానుకు చున్నీతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
పుస్తకాల కోసం పావని సోదరి గది తలుపుకొట్టగా ఎంతకీ తెరవలేదు. అనుమానం వచ్చి కిటికీలోనుంచి చూడగా పావని ఫ్యానుకు వేలాడుతూ కన్పించింది. విగతజీవిగా మారిన తన అక్కను చూసి అమ్మాయి గట్టిగా అరవగా... చుట్టుపక్కలవారు వచ్చి తలుపు తెరిచారు. పావనిని హుటాహుటిన పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.