వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు పట్టణాలు పరిశుభ్రంగా ఉంచాలని ప్రభుత్వం చెబుతున్నా... క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆరురోజులుగా వ్యర్థాల సేకరించకకోవడం వల్ల... సంగారెడ్డి పట్టణం అపరిశుభ్రతకు ఆనవాళ్లుగా మారుతోంది. ఏ గల్లీ చూసినా అపరిశుభ్రతతో పాటు ప్రతి ఇళ్లు దుర్వాసన వెదజల్లుతోంది. అసలే కరోనా విజృంభిస్తున్న సమయంలో మున్సిపాలిటీ అధికారులు, పాలకవర్గం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి పురపాలికలో రోజుకూ సుమారు 40 మెట్రిక్ టన్నుల చెత్త వస్తోంది. గతేడాది నుంచి చెత్తను కులబ్గూర్ చెరువులో వేస్తుండగా... వర్షాలకు ఆ ప్రదేశాన్ని మార్చాల్సి వచ్చింది. ఇందుకోసం ఫసల్వాదీ హనుమాన్‌నగర్‌లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తే స్థానికులు అడ్డుకున్నారు. ఆ తర్వాత పట్టణంలో సుమారు మూడు స్థలాలు గుర్తించగా అక్కడా అదే పరిస్థితి. డంపింగ్ యార్డు వద్దని పోతిరెడ్డిపల్లి రాజంపేట వాసులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. దేవుని కుంట, హాస్టల్‌గడ్డలోనూ జనం నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. నివాసాల మధ్య కాకుండా అధికారులు చిత్తశుద్ధితో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
సమస్య పరిష్కరించకుంటే మరింత దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అపరిశుభ్రతతో వ్యాధులు విజృంభిస్తాయని... అధికారులు, పాలకవర్గం పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'మహా' విషాదం: భవనం కూలిన ఘటనలో 16 మంది బలి