గిట్టుబాటు ధర దక్కకపోవడం, సరైన మార్కెటింగ్ లేక నష్టాలు చవిచూడటం, ఎరువులు లాంటి రైతులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను పరిష్కరించేందుకు కొంతకాలంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ కృషి చేస్తోంది. రైతులు పండించిన పంటకు మార్కెటింగ్ కల్పిస్తూ.. వారికి సరైన ధర వచ్చేలా పనిచేస్తోంది. పట్టణాల్లో ఆకుకూరలపై సరైన అవగాహన లేక వాటిని తినకపోవడాన్ని గుర్తించిన డీడీఎస్. ఈ సమస్యకు తనదైన రీతిలో పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తోంది. రైతులను, వినియోగదారులను ఒకతాటిపైకి తెచ్చి ఇరువురికి ప్రయోజనం చేకూరేలా కృషి చేస్తోంది.
ఎన్నో పోషక విలువలు
సాధారణంగా చేలల్లో కొన్ని రకాల ఆకుకూరలు వాటంతట అవే పెరుగుతుంటాయి. వీటిలో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషక విలువలుంటాయి. ఈ ఆకుకూరల ప్రాముఖ్యతను పట్టణ వినియోగదారులకు తెలియజేసే ప్రయత్నం చేస్తోంది డీడీఎస్. నల్లదొగ్గలి కూర, తెల్ల గర్జల కూర, ఎర్ర గర్జల కూర, గంగవాయిలి, తెల్లపుండి, జొన్న చెంచలి ఇలా రకరకాల కూరలకు ప్రాచుర్యం కల్పించేలా వినూత్న కార్యక్రమం చేపట్టింది. పట్టణాల్లోని వినియోగదారులను పంట పొలాల్లోకి తీసుకువచ్చి... క్షేత్రస్థాయిలో రైతులు పడే కష్టాన్ని, పంట పండే తీరును వివరిస్తోంది.
ఏటికేడు పెంచుతున్నారు
డీడీఎస్ మార్గదర్శకాలతోపాటు వినియోగదారులు ముందుగానే చేస్తున్న ఆర్థిక సాయంతో రైతులు సాగు శాతాన్ని ఏటికేడు పెంచుతున్నారని అధికారులు చెబుతున్నారు. గతేడాది 40 ఎకరాల్లో సాగు చేయగా... ఈ ఏడాది 250 ఎకరాలకు పెంచారని తెలిపారు. ఆకుకూరలు పండే తీరు నుంచీ... ఎలా వండాలో కూడా రైతులు వినియోగదారులకు వివరిస్తున్నారు. సహజసిద్ధంగా లభించే ఆకుకూరలు, వాటి ప్రాధాన్యత తెలుసుకునే అవకాశం దక్కడంపై వినియోగదారులు సంతోషం వ్యక్తం చేశారు.
పత్తి పంట సాగు విస్తీర్ణం పెరగడం, ధాన్యం పంటలపై పక్షుల దాడి పెరగడంతో గత కొన్నేళ్లుగా వెనకంజ వేసిన రైతులు...వినియోగదారులు మద్దతు ధర ఇస్తూ, పెట్టుబడి ఖర్చులు ముందే ఇస్తుండటం వల్ల చిరుధాన్యం సాగుకు అన్నదాతలు జై కొడుతున్నారు.
ఇదీ చూడండి : విత్తన రంగం అభివృద్ధికి చేయూతనిస్తాం: నాబార్డ్ ఛైర్మన్