కరోనా కట్టడికి ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించి సహకరించాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కొవిడ్-19 నివారణ చర్యలపై పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పరిశ్రమల్లో ఉత్పత్తులకు ప్రభుత్వపరంగా సహకారం ఉంటుందని, 24 గంటల విద్యుత్తు సరఫరా చేస్తున్నామని మంత్రి తెలిపారు. కార్మికులను తరలించే బస్సుల్లో భౌతిక దూరం పాటించడంలేదని తన దృష్టికి వచ్చిందని, యాజమాన్యాలు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. తనిఖీలు చేసి నిబంధనలు తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
తరచూ ప్రమాదాలు జరిగే పరిశ్రమలను సందర్శించి కారణాలు ఆరా తీయాలని ఎస్పీకి సూచించారు. పరిశ్రమల్లో ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేయాలని.. యాజమాన్యాలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 08455-272525 నంబరుకు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.
సరకుల పంపిణీ
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆపన్న హస్తం అందించేందుకు అందరూ ముందుకు రావాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తా పీఎస్‌ఆర్ గార్డెన్స్‌లో కళాకారులకు, కలెక్టరేట్‌లో, స్థానిక విద్యుత్తు శాఖ కార్యాలయంలో ఉద్యోగుల ఆధ్వర్యంలో 1,250 మంది పేదలకు నిత్యావసర సరకులు అందజేశారు.
ఇదీ చూడండి: 'తెల్ల బంగారం.. ప్రగతికి సాకారం'