ఈనెల 21న మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ సమీక్ష నిర్వహించనుంది. సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు హాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సమావేశం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని 32 జిల్లాల్లోని మున్సిపాలిటీలపై మూడు దశల్లో పీసీసీ సమీక్ష జరపనుంది.
ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల పరిధిలోని పురపాలికలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3.30 వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలపై సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6 వరకు సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, జనగాం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని మున్సిపాలిటీలపై సమీక్షించాలని హస్తం నేతలు నిర్ణయించారు.
ఈ భేటీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన నేతలు, మాజీలు, ఆఫీస్ బేరర్లు, సమన్వయకర్తలు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇవీ చూడండి: కొత్త పురపాలక చట్ట ముసాయిదా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం