తన అవినీతి, అక్రమాలకు పాల్పడేందుకే ఆంధ్ర కేడర్‌కు చెందిన సోమేశ్ కుమార్‌ను సీఎస్‌గా సీఎం కేసీఆర్ పెట్టుకున్నారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. సీఎస్ హోదాలో పనిచేస్తున్న సోమేశ్ కుమార్ ప్రతిరోజు రెండు కోట్ల రూపాయలు లేనిదే ఆయన ఇంటికి వెళ్లరని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఖజానా నుంచి కొల్లగొట్టిన అక్రమ డబ్బుతో స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ చుట్టుపక్క జిల్లాల్లో భూములు కొనేందుకు తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దాదాపు 100 మంది ఐఏఎస్‌లకు సరైన పోస్టింగులు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. సీఎం కేసీఆర్‌తో పాటు సీఎస్ సోమేశ్ కుమార్ జైలుకెళ్లడం ఖాయమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రజలపై భారం మోపుతున్నారు:
ధరణి, ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలపై రుసుముల భారం మోపుతూ పీడిస్తున్నారని దుయ్యబట్టారు. రిజిస్ట్రేషన్లలను పూర్తిగా నిలిపివేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఎంపీ అన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి పేరుతో వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడంపై మండిపడ్డారు. అవినీతిపరులు ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకోకుండా పూర్తిగా వ్యవస్థను రద్దు చేయడం సరికాదన్నారు. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడంపై స్పందిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అంటే తమకు గౌరవమని ఆమె పార్టీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
సీఎస్ సోమేశ్ కుమార్ ఆంధ్ర కేడర్‌కు చెందిన వ్యక్తి. రోజుకు రెండు, మూడు కోట్లు సంపాదించడమే ఆయన లక్ష్యం. ఎప్పుడు చూసినా శంషాబాద్, ఆదిభట్లలోనే ఆయన కనిపిస్తారు. ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్, ధరణితో ప్రజలను దోచుకుంటుంది. ప్రస్తుతం ఎకరానికి రూ.2500 కట్టాల్సి వస్తోంది. రిజిస్ట్రేషన్లు ఆపే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. నాలుగు పథకాలు పెడితే చాలు ప్రజలు ఓట్లు వేస్తారని కేసీఆర్ అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు. -కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ.