కొత్తగా ఎన్నికైన పాలక వర్గమంతా నూతన మున్సిపల్ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ తొలి కార్యవర్గ సమావేశానికి హాజరైన ఆయన మున్సిపల్ చట్టంపై కౌన్సిలర్లకు అవగాహన కల్పించారు. సింగిల్ విండో ద్వారా ఎలా అనుమతులు ఇచ్చేదీ ఈ చట్టంలో రూపొందించడం జరిగిందని తెలిపారు. ఇది విప్లవాత్మక చట్టమని ప్రజలకు మేలు చేసేదిగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అనంతరం బొల్లారం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందిస్తున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు.