మెదక్ జిల్లా పరిధిలో మంజీరా 96 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. ఈ నదిపై సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలో ఉన్న 'సింగూర్' ప్రాజెక్టు, కొల్చారం మండలం చిన్నఘనపూర్ సమీపంలో ఉన్న 'ఘనపూర్ ఆనకట్ట' మినహా ఎక్కడా నీటి నిల్వకు అవకాశాలు లేవు. ఎగువ నుంచి వరద కాలువ వచ్చినప్పటికీ సింగూర్ పరిమితి తక్కువగా ఉండటం వల్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఘనపూర్ ఆనకట్ట సామర్థ్యం కూడా కేవలం 0.2టీఎంసీలు మాత్రమే కావడం వల్ల నీటిని నిల్వ చేసుకోలేని దుస్థితి ఏర్పడుతోంది.
రూ. 82 కోట్ల నిధుల మంజూరు
సీఎం సొంత జిల్లా కావడం, మంజీరా నది ప్రవాహంపై, సాగునీటి అవసరాలపై పూర్తి అవగాహన ఉండటం వల్ల నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునే మార్గాలను సీఎం అన్వేషించారు. గతేడాది మెదక్ పర్యటనలో మంజీరా బ్యారెజీ నుంచి ఘనపూర్ ఆనకట్ట మధ్య తొమ్మిది.. హల్దీవాగుపై అయిదు చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఇందు కోసం సుమారు రూ. 82 కోట్ల నిధులు మంజూరు చేశారు. దీంతో చెక్ డ్యాంల నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం డిజైన్లు, టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు.
25వేల ఎకరాలు సాగులోకి
చెక్ డ్యాంల నిర్మాణం వల్ల ఏడాది పొడవునా మంజీరా నది నీటితో కళకళలాడనుంది. నదీ పరీవాహక ప్రాంతంలోని అనేక గ్రామాలకు ప్రయోజనం చేకూరనుంది. సాగు, తాగు నీటి లభ్యతతో పాటు భూగర్భ జలాలు పెరగనున్నాయి. వీటి నిర్మాణం పూర్తయితే.. ప్రస్తుత ఆయకట్టు స్థిరీకరణతో పాటు అదనంగా 25 వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా మత్స్య సంపద పెంపకానికి అవకాశం ఉంది. చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తయితే మంజీరా ఎప్పటికీ సజీవమేనని నది పరివాహక ప్రాంతాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం మంజీరా నది చుక్కనీరు లేకుండా పూర్తిగా బోసిపోయి ఉంది. చెక్‌డ్యాంల పనులు చేపట్టడానికి అనుకూలంగా ఉండడం వల్ల వర్షాలు వచ్చే లోపు పనులు పూర్తి చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.