సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సెంతన్ గ్రీన్‌పార్క్ గేటెడ్ కమ్యూనిటీలోని గృహాలను నిర్మించిన బిల్డర్ తన అనుచరులతో వచ్చి తమను బెదిరిస్తున్నాడని కమ్యూనిటీలోని గృహ యజమానులు ఆరోపించారు. నాలుగేళ్ల క్రితం గేటెడ్ కమ్యూనిటీలో ఇళ్లు తీసుకున్న తమకు బిల్డర్.. తొలుత కల్పిస్తానన్న వసతులు ఏర్పాటు చేయకుండా జాప్యం చేస్తున్నాడని వాపోయారు.
కరోనా నేపథ్యంలో తమ కమ్యూనిటీలోకి ఎవరూ రాకుండా గేటు ఏర్పాటు చేస్తుంటే అడ్డుకుని తన అనుచరులతో కలిసి కత్తితో బెదిరించాడని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే 5 నిమిషాల్లో కేసు లేకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఒప్పందంలో ఉన్న మాదిరి తమకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.