లాక్‌డౌన్ కారణంగా సంగారెడ్డిలో చిక్కుకుపోయిన వలస కూలీలు అసహనానికి గురయ్యారు. స్వస్థలాలకు పంపాలంటూ... కంది ఐఐటీ హైదరాబాద్ వద్ద వలస కూలీలు పోలీసులపై రాళ్లు, కట్టెలతో దాడికి దిగారు. పోలీసుల వాహనాన్ని ధ్వంసం చేశారు.
సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్ భవన నిర్మాణ పనుల కోసం.. 1600 మంది కూలీలు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు. లాక్‌డౌన్ నేపథ్యంలో...కార్మికులను యాజమాన్యం ఐఐటీ వద్దే ఉంచింది. నెల రోజులుగా పని, ఆదాయం లేకుండా ఉంటున్న కూలీలు తీవ్ర అసహనానికి గురయ్యారు. స్వస్థలాలకు పంపాలంటూ పోలీసులపై దాడికి దిగారు. పెద్ద పెద్ద రాళ్లతో పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. కట్టెలతో పోలీసులపై దాడికి పాల్పడ్డారు.
రంగంలోకి ఎస్పీ..
ఐఐటీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా.. భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎస్పీ... కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. లాక్‌డౌన్ కారణంగా స్వస్థలాకు పంపే పరిస్థితి లేదని... ఏ సమస్య ఉన్నా తాము తీరుస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: తెలంగాణలో మరో ఆరుగురికి కరోనా.. 1009కి చేరిన కేసులు