సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో గత నెల 27న జరిగిన గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. మహిళ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాల కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.
అసలేం జరిగింది
మెదక్ జిల్లా టేక్మాల్ మండలం గొల్లగూడెంకు చెందిన సాయమ్మ అనే మహిళ సంగారెడ్డిలోని తన సోదరి వీరమణి దగ్గర ఉండి కూలి పని చేసేది. శంకర్పల్లి మండలం శేరుగూడెంకు చెందిన రాంచందర్‌తో సాయమ్మకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరితోపాటు పటాన్చెరు అంబేడ్కర్ కాలనీకి చెందిన సత్యనారాయణ, రాణి కూడా పనిచేసేవారు. సాయమ్మ ఒంటిపై ఉన్న ఆభరణాలు దొంగిలించాలని రాంచందర్ పన్నాగం పన్నాడు. దీనికి పాత నేరస్థుడు సత్యనారాయణతో కలిసి వ్యూహం రచించి గత నెల 27న పటాన్చెరు రమ్మని పిలిచాడు. వచ్చిన సాయమ్మకు మద్యం తాగించి.. రాంచందర్, సత్యనారాయణ, రాణీ ఆమెను అతి కిరాతకంగా గొంతుకోసి హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలను దొంగలించి మృతదేహాన్ని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి పెట్రోలు పోసి తగలబెట్టారు.
ఇలా దొరికారు
సాయమ్మ కనిపింటడం లేదంటూ ఆమె సోదరి వీరమణి గత నెల 30న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదృశ్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా అనుమానితుడిగా రాంచందర్‌ను ఈ నెల 8న అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితున్ని విచారించగా అసలు విషయం బయటకొచ్చింది. అతనికి సహకరించిన సత్యనారాయణ, లక్ష్మి తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారని పటాన్చెరు డీఎస్పీ రాజేశ్వరరావు తెలిపారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, రెండు చరవాణిలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: 'కావాలనే ఆంజనేయులును హత్య చేశారు'