ఓవైపు కొండలు.. మరోవైపు కనకదుర్గమ్మ ఆలయం.. మధ్యలో బిరబిరా పరుగులు తీస‌్తున్న కృష్ణమ్మ. ఇవీ ఆంధ్రప్రదేశ్ విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం కనువిందు చేస్తున్న దృశ్యాలు. ఇటీవలి వర్షాలు, పైనుంచి వరదలు రావడంతో బ్యారేజీ నిండుకుండలా మారింది. గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ దిగువకు పరవళ్లు తొక్కుతోంది.
ఈ నీటి సవ‌్వడిని నగరంతోపాటు సమీప గ్రామాల సందర్శకులు ఆస్వాదిస్తున్నారు. జల తరంగాలను చూసి పరవశించి పోతున్నారు. లాక్‌డౌన్‌తో ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన ప్రజలు... బ్యారేజీ వద్ద ప్రవాహాన్ని చూసేందుకు వరుసకడుతున్నారు. చిన్నపిల్లలు కేరింతలు కొడుతున్నారు. యువతీ యువకులు బ్యారేజీ అందాలతో స్వీయచిత్రాలు తీసుకుంటున్నారు. పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికీ ఆదాయం లభిస్తుందని సందర్శకులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండీ... శ్రీశైలం ఘంటామఠంలో బయటపడ్డ బంగారు నాణేలు