తెలుగు రాష్ట్రాల్లో డ్రాగన్ ఫ్రూట్ పంట సాగుకు పుష్కలమైన అవకాశాలు ఉన్న దృష్ట్యా లోతైన పరిశోధనలు చేయనున్నామని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ(మేనేజ్)లో ఐసీఏఆర్ విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మురుపోజు పద్మయ్య రాసిన "డ్రాగన్ ఫ్రూట్ (సిరిజెమ్మెడు పండు) ప్రయోజనాలు - సాగులో మెళకువలు" పుస్తకాన్ని వీసీ ఆవిష్కరించారు.
రైతులు సంతృప్తిగా ఉన్నారు..
డ్రాగన్ ఫ్రూట్‌లో పోషక భద్రత దృష్ట్యా వంగడాలు, మొక్కల సాంద్రత, పెట్టుబడి, చెట్టుకు ఎన్ని పండ్ల దిగుబడులు, పోషక విలువలు, పంట కోత, అనంతరం శుద్ధి, ఆహారోత్పత్తుల తయారీ, మార్కెటింగ్, వినియోగం, జీవన చక్రం.. వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ప్రవీణ్‌రావు పేర్కొన్నారు. ఐదేళ్లుగా రైతుల అనుభవాలు పరిగణలోకి తీసుకున్నట్లైతే పంట వేసిన తర్వాత మూడో సంవత్సరం నుంచి మంచి లాభాలు వస్తున్నాయని చెబుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ పంట సాగు సంబంధించి తెలుగు భాషలోని పుస్తకాన్ని చదివి రైతులు ఈ అంశంపై సమగ్రంగా తెలుసుకుంటారని అన్నారు.
రెట్టింపు ఆదాయం
వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనల ఫలితాల ఆధారంగా పంటపై తాము కూడా రైతులకు శిక్షణ ఇస్తామని 'మేనేజ్' సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పి.చంద్రశేఖర్ అన్నారు. తెలంగాణ, ఏపీ సహా 14 రాష్ట్రాల్లో 1500 హెక్టార్ల విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్ సాగువుతోందని చెప్పారు. డ్రాగన్ ఫ్రూట్ ఆధారిత ఉత్పత్తుల వల్ల రైతులకు రెట్టింపు ఆదాయం సమకూరుతుందని పుస్తక రచయిత డాక్టర్ పద్మయ్య పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఐఐఓఆర్ సంచాలకులు డాక్టర్ ఎం.సుజాత, విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ కె.ఎస్. వరప్రసాద్, సుస్థిర వ్యవసాయ కేంద్ర డైరెక్టర్ డాక్టర్ జి.వి.రామాంజనేయులు, క్రీడా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుశీలేంద్ర దేశాయ్, ప్రముఖ కవి జి.యాదగిరి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అభివృద్ధి పనులకు కేటీఆర్ శ్రీకారం.. కార్యక్రమంలో ఉద్రిక్తత