Amberpet MLA slaps corporator :రాష్ట్రంలో అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మొన్న ఖమ్మం.. నిన్న పాలమూరు.. ఇవాళ అంబర్‌పేట.. ఇలా ఒక్కో ప్రాంతంలో ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గత విబేధాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ అంబర్‌పేటలో స్థానిక నేతల మధ్య విభేదాలు మహాత్మా జ్యోతిరావు పూలే సాక్షిగా బయటపడ్డాయి. అసలేం జరిగిందంటే..?
Amberpet mla Clash with corporator : రంగారెడ్డి జిల్లాలోని అంబర్‌పేటలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా స్థానిక నేతలు ఆ ప్రాంతంలోని పూలే విగ్రహానికి నివాళులు అర్పించడానికి వెళ్లారు. మొదటగా గోల్నాక కార్పొరేటర్ లావణ్య తన కార్యకర్తలతో కలిసి పూలే విగ్రహం వద్దకు వెళ్లారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్.. లావణ్యను పక్కకు నెట్టేశారు. అంతటితో ఆగకుండా అందరిముందు ఆమెను బెదిరించారు. దీంతో లావణ్య అవమానకరంగా భావించి కంటతడి పెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన గోడు వెల్లబోసుకున్నారు. ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఓ మహిళతో ఇలా ప్రవర్తించడం సబబేనా అని ప్రశ్నించారు.
తాను పూలే విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే వెంకటేశ్ తనను భుజంపై కొట్టారని లావణ్య ఆరోపించారు. అనంతరం అందరు చూస్తుండగానే నడిరోడ్డుపై తనను బెదిరించారని కన్నీటిపర్యంతమయ్యారు. తాను కార్పొరేటర్‌గా ఎన్నికైనప్పటి నుంచి ఎమ్మెల్యే తనపై కక్ష సాధిస్తున్నారని ఆరోపణలు చేశారు. తమ డివిజన్ పరిధిలో అభివృద్ధి జరగకుండా నిధులు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని వాపోయారు. దళితబంధు పథకం కింద లబ్ధిదారుల వివరాలను అందించగా.. అవి పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. ఓ ప్రజాప్రతినిధైన తన పట్లే ఎమ్మెల్యే ఇలా ప్రవర్తిస్తే ఇక సాధారణ ప్రజల పరిస్థితేంటని ప్రశ్నించారు.
"మేము జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులు అర్పించడానికి వచ్చాం. అదే సమయంలో ఎమ్మెల్యే వెెంకటేశ్ వచ్చారు. నివాళులర్పిస్తున్న నన్ను వెనక నుంచి భుజంపై కొట్టారు. ఆ తర్వాత అందరి ముందూ బెదిరించారు. అతను నన్ను ఎందుకు కొట్టారో సమాధానం చెప్పి తీరాలి? ఈ రోజు నుంచి ఈ నియోజక వర్గంలో ఎమ్మెల్యేకి మా బలమేంటో చూపిస్తాం." - దూసరి లావణ్య, గోల్నాక డివిజన్ కార్పొరేటర్
ఇవీ చదవండి: