Pharmacity in hyderabad: ఔషధ రంగానికి రాజధానిగా ఉన్న భాగ్యనగరాన్ని ఈ రంగంలో ప్రపంచపటంలో ముందు వరుసలో నిలిపేలా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అతిపెద్ద ఫార్మాసిటీని చేపట్టింది. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్ల ప్రాంతంలో వేలాది ఎకరాల్లో ఔషధనగరి అభివృద్ధి కోసం ఏర్పాట్లు చేసింది. వివిధ దశల్లో మొత్తం 18వేల 304 ఎకరాల విస్తీర్ణంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ-టీఎస్ఐఐసీ ద్వారా 10వేల పైగా ఎకరాలను సేకరించారు. మరో రెండు నుంచి మూడు వేల ఎకరాలకు కోర్టు స్టే ఇచ్చింది. అది కూడా త్వరలోనే తొలగిపోతుందన్న ఆశాభావంతో సర్కార్ ఉంది. ఇప్పటికే సేకరించిన భూమిలో మౌలికసదుపాయాలను కూడా కల్పించారు. అంతర్గత రహదారులు, డ్రైనేజీ, విద్యుత్ దీపాలు తదితరాల నిర్మాణం పూర్తైంది. సరిపడా విద్యుత్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఔషధనగరికి అవసరమైన నీటిని మిషన్ భగీరథ సోర్స్ నుంచి తీసుకోనున్నారు. కాలుష్యానికి ఆస్కారం లేకుండా గ్రీన్ ఫీల్డ్ ఫార్మాసిటీని అభివృద్ధి చేస్తున్నారు. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఉండేలా ఉమ్మడి వ్యర్థాల నిర్వహణా ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. సీఈటీపీ నిర్మాణం కోసం దాదాపుగా 2000 కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుందని అంచనా. మొత్తం 120 ఎంఎల్ డీ సామర్థ్యంతో ఐదు జోన్లలో ఐదు ప్లాంట్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రతిపాదనల కోసం వినతులు స్వీకరిస్తున్నారు. ఆ గడువు నెలాఖరుతో ముగియనుంది.
Pharmacity in mucherla: ఔషధనగరికి ఇప్పటికే పర్యావరణ అనుమతులు సహా అన్ని రకాల అనుమతులు వచ్చాయి. ఫార్మాసిటీని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నేషనల్ ఇండస్ట్రియల్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ - నిమ్జ్‌గా కూడా గుర్తించింది. నిమ్జ్ మార్గదర్శకాల ప్రకారం ఫార్మాసిటీ అభివృద్ధి, విస్తరణ, మౌలిక సదుపాయాల కోసం దాదాపు ఐదువేల కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కేంద్రానికి గతంలోనే ప్రతిపాదనలు పంపారు. పరిశ్రమలశాఖా మంత్రి కేటీఆర్ సైతం పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఫార్మాసిటీకి భూములు ఇచ్చిన రైతులకు నివాస ప్లాట్లు ఇచ్చేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఎకరానికి 120 గజాల చొప్పున ఇంటిస్థలం ఇవ్వనున్నారు. నిర్వాసిత కుటుంబాల్లోని యువతకు ఉచితంగా ఉపాధి శిక్షణ కూడా ఇస్తున్నారు. వారికి ఔషధనగరిలో ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు తీసుకోనున్నారు. ఫార్మాసిటీలో పరిశ్రమలతో పాటు పరిశోధనకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అక్కడే ఫార్మా విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఔషధనగరిలో స్థలాలు కేటాయించాలని కోరుతూ ఇప్పటికే దాదాపుగా 500 వరకు ఔషధ, పరిశోధనా సంస్థలు టీఎస్‌ఐఐసీకి దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో జాతీయ సంస్థలతో పాటు కొన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా ఉన్నాయి. ఆయా సంస్థల డీపీఆర్లను పరిశీలించి కంపెనీల అవసరాలకు అనుగుణంగా అర ఎకరం మొదలు ఎకరం నుంచి పది ఎకరాలకు పైగా కూడా స్థలాలు కేటాయించనున్నారు. మొదటి దశలోనే దాదాపు ఆరు నుంచి ఏడు వేల ఎకరాల వరకు కేటాయింపులు జరగవచ్చని అంచనా వేస్తున్నారు.
వచ్చేనెలలో ప్రారంభం
వచ్చే నెలలో ఫార్మాసిటీని ప్రారంభించాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సంబంధిత పనులు వేగవంతం చేస్తున్నారు. ఔషధ, పరిశోధనా సంస్థలకు సంబంధించి ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన ఎకోసిస్టంను ఔషధనగరిలో అభివృద్ధి చేయనున్నారు. ఫార్మాసిటీతో 60వేల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని, 50వేల కోట్లకు పైగా వార్షిక ఎగుమతులకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రత్యక్షంగా ఆరు లక్షల మంది వరకు, పరోక్షంగా ఇంకా పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా.