Students tested positive for corona:తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని ఓ ప్రైవేటు కళాశాలలో మంగళవారం 90 మంది విద్యార్థులకు ఆరోగ్య సిబ్బంది ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా .. 14 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈ రెసిడెన్షియల్ కళాశాలలో దాదాపు 300 మందికిపైగా విద్యార్థులున్నారు. బుధవారం మరోసారి వీరికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ టెస్టులు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.
కొత్తగా 228 కరోనా కేసులు.. ఒకరి మృతి
Telangana Corona cases: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 41,678 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 228 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,81,072కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,024కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 185 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,828 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
telangana omicron cases: మరోవైపు తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు చాపకింద నీరులా పెరిగిపోతున్నాయి. మంగళవారం మరో 7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కాగా... రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 62కు చేరుకుంది. ఈ 62 మంది ఒమిక్రాన్ బాధితుల్లో 46 మంది టీకా తీసుకోకపోవటం కొసమెరుపు. ట్రావెల్ హిస్టరీ లేని ముగ్గురికి ఒమిక్రాన్ నిర్ధరణైనట్టు వైద్యశాఖ వెల్లడించింది. ఇప్పుడు ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. ఇన్ని రోజులు బయటి దేశాల నుంచి వచ్చినవాళ్లకే ఒమిక్రాన్ నిర్ధరణ కాగా.. ఇప్పుడు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేనివారిలోనూ వేరియంట్ గుర్తించటంతో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
ఇదీ చూడండి: Omicron Cases: అక్కడ కొత్త కరోనా కేసుల్లో ఒమిక్రాన్‌వే 60 శాతం!