కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ సంతకాల సేకరణ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జీ మణికం ఠాగూర్, టీపీసీసీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు కిచ్చెన్నగారి లక్ష్మా రెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జీ సున్నపు వసంతం పాల్గొన్నారు.
వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని మణికం ఠాగూర్ డిమాండ్ చేశారు. బిల్లులను ఉపసంహరించే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ రైతులకు అండగా ఉంటుందన్నారు. తెరాస ప్రభుత్వం బంగారు తెలంగాణ అని చెప్పి ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందన్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి.. కేసీఆర్ అవినీతి పాలనపై ప్రశ్నించటం లేదన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపి అక్రమ ఆస్తులు స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచుతామని చెప్పారు. జిల్లా, మండలాల అధ్యక్షులు సంతకాల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. 2023 ఎన్నికల్లో హస్తం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఆ పరిస్థితిని కేసీఆర్ ప్రభుత్వం కొనితెచ్చుకోవద్దు: బండి సంజయ్