ఓట్లు, సీట్లు కొనేందుకు సిద్ధంగా ఉన్న సీఎం కేసీఆర్... వరి ధాన్యం కొనమని చెబుతూ రైతులను నట్టేట ముంచుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ధాన్యం కొనుగోలుకు కేంద్రం డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొండికేస్తూ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్గుల్లో నియోజకవర్గ భాజపా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కందుకూర్లో జరిగిన సభకు హాజరయ్యారు. బండి సంజయ్ సమక్షంలో పలువురు స్థానిక తెదేపా నేతలు, కార్యకర్తలు భాజపాలో చేరారు.
మండలానికి వంద మంది చొప్పున యువకులను అప్పగిస్తే తెరాస ప్రభుత్వాన్ని కూల్చి భాజపాను అధికారంలోకి తీసుకొస్తా అని బండి సంజయ్ తెలిపారు. రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా, ఇంటర్ విద్యార్థులు చనిపోయినా, భాజపా కార్యకర్తలపై దాడి జరిగినా సీఎం కేసీఆర్ ఏనాడు నోరుమెదలేదని విమర్శించారు. తాను భయంకరమైన హిందువని చెబుతూ ఎంఐఎంకి వంతపాడుతుండటం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణలో అమరుల ఆశయాలకు భిన్నంగా నయా నిజాం, నియంత, అవినీతి పాలన సాగుతోందని ఆరోపించారు.
'తెలంగాణ తల్లి గడీల్లో బందీగా మారి తల్లడిల్లుతోంది. కేసీఆర్ మూర్ఖపు పాలన నుంచి విముక్తి చేయాలని భాజపా కార్యకర్తలు కాషాయ జెండా ఎత్తి పోరాడుతున్నారు. కేసీఆర్ పాలనను కూల్చి గొల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేసేందుకు ఉద్యమిస్తున్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న రెండో విడత పాదయాత్ర ప్రారంభిస్తున్నా.' - బండి సంజయ్
అంబేడ్కర్ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేయాలని చూస్తున్న కేసీఆర్.. రాష్ట్రంలో ముస్లింలకు 14 శాతం రిజర్వేషన్లు ఇచ్చే కుట్ర చేస్తున్నరని బండి సంజయ్ మండిపడ్డారు. మైనారిటీ సంతుష్ట విధానాలకు వ్యతిరేకంగా భాజుపా సాగిస్తున్న ఈ మహోద్యమంలో కలిసి రావాలని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా భాజపా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, నియోజకవర్గ భాజపా ఇంఛార్జి అందెల శ్రీరాములు, తుళ్ల వీరేందర్ గౌడ్, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : 'నేను రాహుల్‌గాంధీ మాదిరిగా పారిపోలేదు.. ప్రజలతో ఉన్నా'