Ramanuja Sahasrabdi Celebrations: జగద్గురు శ్రీరామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. 12 రోజుల ఉత్సవాల్లో రోజుకో ప్రత్యేకతతో శ్రీరామనగరం శోభిల్లుతోంది. బృహన్ మూర్తి సమతామూర్తి విగ్రహాన్ని లోకార్పణం చేయడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి రామానుజాచార్యుల విగ్రహాన్ని సందర్శించుకుంటున్నారు. ఉత్సవాల్లో మరో కీలక ఘట్టం ఆరో రోజు ఆవిష్కతమైంది. సమతామూర్తి చుట్టూ నిర్మించిన 108 దివ్యదేశాల్లో 32 దివ్యదేశాల్లో దేవతామూర్తులకు శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠాపన చేశారు.
యాగశాలలోని పుష్ప మండపంలో వైదిక సంస్కారాలు పూర్తి చేసుకున్న 33 దేవతా మూర్తుల విగ్రహాలను చిన్నజీయర్ స్వామి సమక్షంలో వేదపారాయణం చేస్తూ శోభాయాత్రగా దివ్యదేశాలకు తీసుకెళ్లారు. అక్కడ 9 మంది జీయర్ స్వాముల వేద మంత్రోచ్చారణల మధ్య 32 ఆలయాల్లో ఉత్సవ మూర్తులకు ప్రాణప్రతిష్ఠ చేశారు. అప్పటికే రాహుకాలం రావడంతో అయోధ్యలో ఉత్సవమూర్తి విగ్రహ ప్రతిష్ఠను వాయిదా వేశారు.
మూర్తుల నక్షత్రాన్ని, మూహుర్తాన్ని బట్టి దివ్యదేశాల్లోని ఆలయాల్లో ప్రతిష్టాపన నిర్వహించినట్లు చినజీయర్ స్వామి తెలిపారు. ఈ నెల 10న 19 ఆలయాల్లో మూర్తుల ప్రతిష్టాపన జరుగనుంది. అలాగే 11న 36 దివ్యదేశాలు, 13న 21 ఆలయాల్లో దేవతల ప్రతిష్ఠాపన చేయనున్నారు. అత్యంత ముఖ్యమైన రామానుజచార్యుల స్వర్ణమూర్తికి ఈ నెల 13న ప్రాణప్రతిష్ఠాపన జరుగనుంది. ఈ వేడుకకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా రానున్నారు. మొత్తం దివ్యదేశాల్లో దేవతామూర్తుల ప్రతిష్టాపన పూరైన తర్వాతే సాధారణ భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తారు. అప్పటి వరకు 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకొని పరిక్రమణ చేసుకోవచ్చని చినజీయర్ స్వామి వివరించారు.
ఇదీ చూడండి: