శంషాబాద్ పశు వైద్యురాలి హత్యాచారం కేసులో నిందితులను షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ నుంచి జైలుకు తీసుకెళ్లే క్రమంలో స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. నలుగురు నిందితులు షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నారన్న విషయం తెలుసుకున్న స్థానికులు శనివారం ఉదయం 9 గంటలకే అక్కడికి చేరుకున్నారు. షాద్‌నగర్ పట్టణంతో పాటు... చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వాళ్లు వేల సంఖ్యలో వచ్చారు. పోలీస్ స్టేషన్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు సైతం ఎత్తి కింద పడేశారు. పోలీసుల పైకి చెప్పులు కూడా రువ్వారు.
ఉద్రిక్తల నడుమ నిందితులను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లడం మంచిది కాదని భావించిన పోలీసులు వైద్యులను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. షాద్ నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి చెందిన ముగ్గురు వైద్యులు వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు నివేదించారు. షాద్‌నగర్ న్యాయస్థానంలో న్యాయమూర్తులు అందుబాటులో లేకపోవడం వల్ల మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అయిన షాద్‌నగర్ తహసీల్దార్ ఎదుట ప్రవేశపెట్టాలని భావించారు. స్టేషన్‌కు వచ్చిన తహసీల్దార్ నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు.
నలుగురు నిందితులను వాస్తవానికి మహబూబ్ నగర్ జిల్లా జైలుకు తరలించాల్సి ఉన్నా... పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి జైలుకు తరలించారు. భారీ బందోబస్తు మధ్య ఆరు వాహనాల శ్రేణిలో నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. వాహనాలు పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఆందోళనకారులు చెప్పులు, రాళ్లు విసిరారు. పోలీసులు మరోసారి ఆందోళనకారులను చెదరగొడుతూ వాహనాలను హైదరాబాద్ వైపు తీసుకెళ్లారు.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థానికులు అక్కడే ఉండి ఆందోళన చేశారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి నలుగురు డీసీపీలు, ఆరుగురు ఏసీపీలతో పాటు షాద్‌నగర్ సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు పోలీస్ స్టేషన్ ఎదుటే ఉన్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులతో పాటు అదనపు బలగాలను పోలీస్ స్టేషన్ ఎదుట బందోబస్తు నిర్వహించారు.
ఇవీ చూడండి: శంషాబాద్ నిందితులను పట్టించిన ఫోన్ కాల్