Pulse Polio in Telangana 2022: ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం అయ్యేలా అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. సుమారు 39 లక్షల మంది చిన్నారులకు ఈ రోజు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం 23 వేల 331 కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
దేశంలోనే అగ్రస్థానం
కరోనా వ్యాక్సిన్, పోలియో చుక్కల పంపిణీలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరీలు, బస్టాండ్లు, ఎయిర్ పోర్టులు, పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక పోలియో వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. త్వరలో హైదరాబాద్‌లో మరో 94 బస్తీ దవాఖానాలు ప్రారంభించనున్నట్టు తెలిపారు. బస్తీ దవాఖానాలను సాయంత్రం కూడా తెరవాలని వైద్యులకు సూచించినట్లు స్పష్టం చేశారు.
వారికి రేపు అవకాశం
"సంచార జాతులు, ప్రయాణాల్లో ఉన్నవారిని దృష్టిలో ఉంచుకొని... 869 ట్రాన్సిట్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. అన్ని జిల్లాలకు కలిపి 50 లక్షల 14 వేల డోసులు పంపించాం. ఇవాళ పోలియో చుక్కలు వేయించుకోలేని చిన్నారుల కోసం రెండ్రోజుల పాటు వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి అందిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో బుధవారం సైతం పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతుంది." -హరీశ్ రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి
ఖమ్మం జిల్లాలో
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 950 కేంద్రాల్లో లక్షా 30 వేల చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు రవాణా మంత్రి అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మంలోని తుమ్మల గడ్డ పాఠశాలలో చిన్నారులకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులను బుజ్జగిస్తూ ఆయనే స్వయంగా చుక్కలు వేశారు.
వైద్యానికి పెద్దపీట: ఎర్రబెల్లి
రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి పెద్ద పీట వేస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని, రాయపర్తిలో పిల్లలకు.. మంత్రి ఎర్రబెల్లి పోలియో చుక్కలు వేశారు. కరోనా సంక్షోభంలోనూ వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది మెరుగైన పనితీరు కనబర్చారని మంత్రి ఎర్రబెల్లి ప్రశంసించారు. కరోనా కట్టడి, నివారణలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ వేయించాలని సూచించారు.
తప్పనిసరి
చిన్నారుల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు తప్పనిసరని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. తద్వారా రాష్ట్రాన్ని పోలియో రహిత రాష్ట్రంగా మార్చుకోవచ్చని అభిప్రాయపడ్డారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. తమ మనుమరాళ్లకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని మంత్రి సత్యవతి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. క్రమం తప్పకుండా పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 73,757 మంది చిన్నారులకు గాను 462 కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు.
పోలియో రహిత దేశంగా
పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో చిన్నారులకు చుక్కల మందు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చుక్కల మందు వేయించడంలో నిర్లక్ష్యం వహించవద్దని మంత్రి కోరారు. దేశంలో అంగవైకల్యం తగ్గిందని.. పోలియో రహిత దేశంగా అడుగులు ముందుకు వేశామని పేర్కొన్నారు. అందుకు గణాంకాలే ఉదాహరణ అని స్పష్టం చేశారు.
స్వయంగా కలెక్టరే..
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో కలెక్టర్ రాహుల్ రాజ్.. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తన ఇద్దరు కుమార్తెలతో పాటు మిగతా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత సమాజం కావాలని ఆకాంక్షించారు. తన పిల్లలకు కూడా అందరితో పాటు పోలియో చుక్కలు వేసి.. సమాజానికి ఆదర్శంగా నిలిచారు.
ఇదీ చదవండి: Pulse Polio 2022: నిండు జీవితానికి రెండు చుక్కలు.. నేడు పల్స్ పోలియో కార్యక్రమం..