రంగారెడ్డి జిల్లా హయత్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ పరీక్షల కోసం వచ్చిన వారికి కష్టాలు తప్పడం లేదు. కరోనా టీకా కోసం సుమారు 200 మంది ఎండలోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వ్యాక్సిన్ కోసం వచ్చిన వారిలో 45 ఏళ్లు పైబడినవారు వృద్ధులు ఉండటంతో ఎండ తాకిడికి తట్టుకోలేక చెప్పులు క్యూలో పెట్టి చెట్ల కింద వేచి చూస్తున్నారు. ఇన్నీ ఇబ్బందులు పడుతున్నా అధికారులు మాత్రం నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వారం నుంచి ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.