రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం రోజున ఎడతెరిపిలేని వాన కురిసింది. ఈ వర్షానికి శంషాబాద్ బస్టాండ్ నుంచి పాత శంషాబాద్ వెళ్లే రహదారిలో భారీ వరద చేరింది. ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉద్ధృతితో ఓవైపు నుంచి మరోవైపునకు వెళ్లడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ఎటువైపు ప్రజలు అటువైపునే ఉండిపోయారు.
విషయం తెలుసుకున్న శంషాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకున్నారు. జేసీబీని రప్పించి.. దాని సాయంతో ప్రజలను వరద దాటించారు. సాయంత్రం కురిసిన వర్షానికి శంషాబాద్ రైల్వే అండర్ పాసింగ్ వద్ద పెద్ద ఎత్తున వరద చేరింది. గతంలో రైల్వే కంట్రాక్టర్లు తూతూ మంత్రంగా అండర్ పాసింగ్ నిర్మించడం వల్లే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వానలు కురిసినప్పుడే కాకుండా.. మామూలు రోజుల్లోనూ తమ గురించి పట్టించుకోవాలని ప్రజాప్రతినిధులను కోరారు. ఇప్పటికైనా వరదల వల్ల ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.