రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. నియోజకవర్గంలో షాద్‌నగర్, చేగూరు పీఏసీఎస్ సంయుక్తంగా షాద్‌నగర్ పట్టణంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా కొత్తపేట, కొందర్గు, మేకగూడా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు వారి వారి ప్రదేశాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు తాము పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించడానికి సిద్ధమయ్యారు.
గన్నీ బ్యాగుల కొరత
విక్రయించిన ధాన్యాన్ని మిల్లుకు తరలించడంలో జరుగుతున్న జాప్యం అటు అన్నదాతలను ఇటు కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఇబ్బందులకు గురి చేస్తోంది. గన్నీ బ్యాగులను వెంటనే సరఫరా చేయాలని కొందర్గు పీఏసీఎస్ ఎదుట బుధవారం.. రైతులు ఆందోళన దిగారు. అలాగే షాద్‌నగర్ కొనుగోలు కేంద్రం వద్ద గురువారం.. అన్నదాతలు నిర్వాహకులతో వాగ్వివాదానికి దిగారు. వెంటనే గన్నీ బ్యాగులు సరఫరా చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మరో వైపు వేలాదిగా తరలివస్తున్న ధాన్యం బస్తాలతో ఇప్పటికే గోదాములు నిండిపోగా మరి కొంతమంది రైతులు తమ ధాన్యాన్ని తీసుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయా కొనుగోలు కేంద్రాల వద్ద దాదాపు 40 వేల బస్తాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. బస్తాలు రవాణా చేయడానికి టెండరు తీసుకున్న గుత్తేదారులు నిత్యం రెండు, మూడు లారీలను మాత్రమే పంపించడంతో పూర్తి స్థాయిలో ధాన్యం బస్తాలను మిల్లు వద్దకు తరలించలేక పోతున్నామని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అకాల వర్షాలతో నష్టాలు
షాద్‌నగర్ పరిధిలో వివిధ గ్రామాల నుంచి అన్నదాతలు తీసుకొచ్చిన ధాన్యం బస్తాలు యార్డు ఆవరణలో బహిరంగంగానే పెట్టడంతో వర్షాలు పడితే తడిసి ముద్దవుతున్నాయి. మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలకు చాలా ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు మరో మూడు రోజులు ఆవరణంలో ఆరబెట్టారు. గోదాంలో స్థలం లేకనే ఈ పరిస్థితి నెలకొందని అన్నదాతలు, నిర్వాహకులు చెబుతున్నారు. ధాన్యాన్ని మిల్లుకు చేర్చితేనే రైతు ఖాతాలో నగదు పడుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. ఫలితంగా రవాణాలో జరుగుతున్న జాప్యంతో అన్నదాతలకు ఖాతాలో డబ్బు జమ ఆలస్యమవుతోంది. అవసరం ఉన్న బ్యాగ్‌లను సరఫరా చేయడంతో పాటు త్వరితగతిన ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించి సమస్యలు పరిష్కరించాలని అటు రైతులు, నిర్వాహకులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ మహమ్మారిని జయించిన పదినెలల చిన్నారి