MLC Patnam Mahender Reddy Audio Viral: రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఫోన్లో పరుష పదజాలం ఉపయోగిస్తూ సీఐని బెదిరించారు. మూడు రోజుల కిందట తాండూరు పట్టణంలోని భద్రేశ్వర ఆలయం జాతరలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌తో వచ్చిన రౌడీషీటర్లకు పోలీసులు సహకరించారని ఆ ఆడియోలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆరోపించారు. కార్పెట్ ఎందుకు వేశారంటూ సీఐని దుర్భాషలాడుతూ నిలదీశారు.
స్పందించిన సీఐ కార్పెట్ వేయడం, తీయడం మా పని కాదని సమాధానం ఇవ్వడంతో మరింత ఘాటుగా స్పందించిన మహేందర్ రెడ్డి... నీ అంతూ చూస్తానంటూ బెదిరించారు. ఈ ఆడియో వైరల్‌గా మారడంతో మహేందర్ రెడ్డి వివరణ కోసం ఈటీవీ భారత్ ప్రయత్నించగా... తానేమి మాట్లాడలేనని తెలిపారు. అలాగే సీఐ రాజేందర్ రెడ్డిని ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు. అయితే గతంలోనూ మహేందర్ రెడ్డి పోలీసులు, రెవెన్యూ అధికారులపై తీవ్రంగా దుర్భాషలాడిన సందర్భాలు కూడా ఉన్నాయంటూ స్థానిక ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది.
ఈ ఆడియో వైరల్ కావటంతో.. సీఐ రాజేందర్‌రెడ్డి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తన విధులకు ఆటంకం కలిగించటమే కాకుండా.. పరుష పదజాలంతో దూషించి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిపై 353, 504, 506 సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్గీయులు తాండూరు పట్టణంలోని ఇందిరా గాంధీ కూడలిలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. మహేందర్ రెడ్డిని అరెస్టు చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: