రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలో సుడిగాలి పర్యటన చేస్తూ పలు అభివృద్ధి పనులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీలోని ఆరు వార్డుల్లో దాదాపు 86 లక్షలతో మురుగు నీటి కాలువ పనులను తన చేతుల మీదుగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అనేక అభివృద్ధి పనులను చేపట్టామని మంత్రి సబిత అన్నారు. త్వరలోనే జల్పల్లి మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్‌ను నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు.
జల్పల్లి పరిధిలోని చెరువు సుందరీకరణకు నిధులు మంజూరు అయ్యాయని... 6 నెలల్లో ఆ పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటింటికి సురక్షిత తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. అనంతరం వార్డు నెంబర్22లో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలను మంత్రి సందర్శించారు. ఇటీవలే ఈ బడిని ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమికోన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రికి ఉపాధ్యాయులు, స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది, జల్పల్లి మున్సిపాలిటీ తెరాస అధ్యక్షుడు ఇక్బాల్ బిన్ ఖలీఫా, ఉపాధ్యక్షుడు సయ్యద్ యూసుఫ్ పటేల్, స్థానిక కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: KTR: పేదల ముఖంలో చిరునవ్వు చూడడమే ప్రభుత్వ లక్ష్యం