సహజంగా సర్పంచి పదవుల్లో ఉంటేనే రోడ్డు పక్కన కూరగాయలు కొనడానికి ఇబ్బంది పడుతుంటారు కొందరు. కానీ మంత్రి సబిత మాత్రం రోడ్డు పక్కనే కూరగాయలు కొని స్థానికులను ఆశ్చర్యానికి గురి చేశారు. అతి సాదారణ గృహిణిలాగా కూరగాయలను కొన్నారు. మీ పొలంలోనే పండించారా? ఎంత గిట్టుబాటు అవుతుందంటూ ప్రశ్నలు వేస్తూ కూరగాయలు బేరం చేశారు. పల్లె నిద్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరు గ్రామంలో మంత్రి పర్యటిస్తూ... మహిళా రైతులు అమ్మకానికి పెట్టిన కూరగాయలను కొనుగోలు చేశారు. ఆ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ప్రతి సోమవారం మహేశ్వరం నియోజకవర్గంలోని ఒక గ్రామంలో మంత్రి పర్యటిస్తున్నారు. గ్రామస్థుల కష్ట సుఖాలను తెలుసుకుంటూ ఆ రోజు రాత్రి పల్లెలోనే నిద్రిస్తారు. అర్హులకు పింఛన్లు, రేషన్ బియ్యం, రైతు బంధు వంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని మంత్రి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జడ్పీ ఛైర్పర్సన్ అనితా రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: గ్రామీణ ఆర్థిక జీవనంలో మార్పు వచ్చింది: కేటీఆర్