మరోసారి హైదరాబాద్ తడిసిముద్దయింది. దాదాపు ఏకధాటిగా రెండు గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షానికి భాగ్యనగరం చిగురుటాకులా వణికిపోయింది. మేఘానికి చిల్లుపడిందా అన్నట్టుగా కురిసిన భారీ వర్షానికి రహదారులన్నీ చెరువులను తలపించాయి. నగరవాసులు ఇళ్లకు చేరుకునే సమయంలో వర్షం మొదలవడంతో ఎక్కడికక్కడ రోడ్లపక్కన జనం తలదాచుకున్నారు. కాసేపటికి తగ్గుతుందిలే అనుకునేలోపే వర్షం దంచికొట్టడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. వరదనీటిలో చిక్కుకుని పలువురు ప్రమాదానికి గురయ్యారు. వర్షానికి తడిసి వాహనాలు మొరాయించడంతో మరికొందరు వాటిని తోసుకుంటూ వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లకు చేరుకున్నారు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండ, శంషాబాద్, రాజేంద్రనగర్, కిస్మత్‌పురా, రామ్‌నగర్, పాతబస్తీ, గోల్కొండ, చంపాపేట్, సైదాబాద్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్, హయత్‌నగర్, పెద్దఅంబర్‌పేట, అబ్దుల్లాపూర్ మెట్, అనాజ్‌పూర్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షానికి విజయవాడ జాతీయ రహదారిపై భారీగా నీరు నిలిచిపోయింది. సుష్మా, పనామా, చింతల్‌కుంట కూడళ్లలో మోకాలిలోతు నీరు నిలిచింది. దీంతో హయత్ నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు ట్రాఫిక్ స్తంభించింది. చంపాపేటలో ఓ వ్యక్తి మ్యాన్‌హోల్ పడిపోయినట్లు సమాచారం. బైక్‌పై వస్తున్న మరో నాలా దాటుతున్న కింద పడిపోగా.. స్థానికులు రక్షించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షంతో ప్రజలకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు. రోడ్లపై నిలిచిఉండే నీరు సాఫీగా వెళ్లేలా మాన్సూన్ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండాలని సూచించారు. అవసరమైతే డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్దంగా ఉండాలని సూచించారు. ఏవైనా సమస్యలు వస్తే జీహెచ్‌ఎంసీ కాల్ సెంటర్ 040-21111111కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
చింతలకుంట వద్ద నాలాలో పడిన వ్యక్తి సురక్షితం
చింతల కుంట వద్ద నాలాలో గల్లంతైన వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. నాలాలో పడిపోయిన వ్యక్తి కర్మన్‌ఘాట్‌కు చెందిన జగదీశ్‌గా గుర్తించారు. ప్రస్తుతం జగదీశ్ సురక్షితంగా ఉన్నట్టు అతని సోదరుడు తెలిపారు. నాలాలో పడిన వెంటనే తాడు సాయంతో ప్రమాదం నుంచి బయటపడినట్టు చెప్పారు. లింగోజిగూడలో అత్యధికంగా 10.6 సెంటీమీటర్లు, కుర్మగూడలో 10, హస్తినాపురంలో 8.8, మలక్‌పేటలో 8.7, సరూర్‌నగర్‌లో 8.6, కంచన్‌బాగ్‌లో 8.4, బహదూర్‌పురాలో 8.1, రెయిన్ బజార్‌లో 7.7, అత్తాపూర్‌లో 6.9, రాజేంద్రనగర్, శివరాంపల్లిలో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రాగల 3 రోజులు తేలికపాటి వర్షాలు
రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు కిందిస్థాయి గాలులు తూర్పు, ఈశాన్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్నట్టు తెలిపింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా పశ్చిమమధ్య బంగాళాఖాతం వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడినట్టు పేర్కొంది. ఈనెల 10న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్యదిశగా ప్రయాణించి తదుపరి 4-5 రోజుల్లో దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తా ఆంధ్రా తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.
ఇదీ చూడండి: RAIN IN HYDERABAD: హైదరాబాద్‌లో కుంభవృష్టి.. ఏరులను తలపిస్తున్న కాలనీలు