High Court on septic tank tragedy: రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేస్తూ ఇద్దరు కార్మికులు మరణించిన ఘటనను హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణలోకి తీసుకుంది. గత నెల 28న గౌతమి ఎన్‌క్లేవ్‌లోని అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు వెళ్లి ఇద్దరు చనిపోవడంపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్... ఈ అంశాన్ని సుమోటో పిల్‌గా విచారణ చేపట్టాలని సీజేకు లేఖ రాశారు. సెప్టిక్ ట్యాంకును మనుషులతో శుభ్రం చేయడంపై నిషేధం ఉందని లేఖలో పేర్కొన్నారు.
pill on septic tank tragedy:సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ మృతి చెందిన కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఆ లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ, కార్మిక శాఖ కమిషనర్‌ను ప్రతివాదులుగా పేర్కొంటూ.. హైకోర్టు ఆ లేఖను సుమోటో పిల్‌గా పరిగణలోకి తీసుకుంది.
అసలేం జరిగిందంటే?
గౌతమి ఎన్‌క్లేవ్‌లోని శివదుర్గ అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు మొత్తం నలుగురు కూలీలు వచ్చారు. మొదటగా ఇద్దరు కూలీలు లోపలికి దిగి ఊపిరాడటం లేదని వెంటనే బయటకు వచ్చారు. అనంతరం మరో ఇద్దరు కూలీలు లోపలికి దిగారు. అయితే వారు ఎంత సేపటికీ బయటకి రాలేదు. దీంతో మిగతా ఇద్దరు వారికి ఏం జరిగిందోనని లోపలికి దిగి చూడగా ఆ ఇద్దరు విగత జీవులుగా కనిపించారు. ఆక్సిజన్ ట్యాంక్ సహాయంతో లోపలికి దిగి మృతదేహాలను బయటకు తీశారు. మృతులు శ్రీను, అంజయ్యగా గుర్తించారు. వీరు సింగరేణి కాలనీకి చెందినవారిగా గుర్తించారు. మరో ఇద్దరు స్వామి, జాన్‌లు స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో కొండపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: Gachibowli septic tank incident : సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీలు మృతి