Financial Year 2022- 23: మరో ఆర్థిక సంవత్సరం ముగిసింది. నేటి నుంచి 2022- 23 ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతోంది. 2021- 22లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చేసిన వ్యయం రూ. లక్షా 80వేల కోట్ల మార్కును సమీపించే అవకాశం ఉంది. కాగ్‌కు సమర్పించిన వివరాల ప్రకారం ఫిబ్రవరి నెలాఖరు వరకు రూ. లక్షా 48వేల కోట్లు ఖర్చు చేసింది. మార్చి నెలలో మరో రూ. 30వేల కోట్ల వరకు ఖర్చు అయినట్లు సమాచారం. దీంతో 2021- 22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యయం రూ. లక్షా 77 వేల కోట్ల నుంచి రూ. లక్షా 80వేల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది.
పెరిగిన ఆదాయం: కొవిడ్ ఉద్ధృతి తగ్గడంతో గత రెండేళ్లుగా బాగా తగ్గిన ఆదాయం పుంజుకుంది. రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఆదాయం ఫిబ్రవరి నెలాఖరు వరకే 92 శాతం అంచనాలను చేరుకుంది. ఫిబ్రవరి నెలలో అత్యధికంగా రూ. 12,820 కోట్ల ఆదాయం వచ్చింది. మార్చిలోనూ దాదాపుగా అంతే మొత్తం ఆదాయం వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. స్టాంపులు- రిజిస్ట్రేషన్లు, జీఎస్టీ, అమ్మకం పన్ను, ఎక్సైజ్ ఆదాయం అన్ని కూడా రికార్డు స్థాయిలో పెరిగినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఆదాయం అంచనా ఇంకా పెరుగుతుందన్న ఆశాభావంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
పన్ను ఆదాయంపై అంచనాలు: 2021- 22లో పన్ను ఆదాయం అంచనాను రూ. లక్షా 6 వేల కోట్లుగా ప్రతిపాదించిన సర్కార్... 2022- 23లో ఆ మొత్తాన్ని రూ. లక్షా 26వేలకు పెంచింది. నిన్నటితో పూర్తైన ఆర్థిక సంవత్సరం రాబడులను చూస్తే కొత్త ఏడాదిలో పన్ను ఆదాయం బాగా పెరుగుతుందని భావిస్తున్నారు. పన్నేతర ఆదాయంపై కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. భూములు, ప్లాట్ల అమ్మకం, క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు గనుల శాఖలో సంస్కరణలు, ఇతర అనుమతుల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే ప్రణాళికలు రూపొందించింది. అందుకు అనుగుణంగానే భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
2021-22 బడ్జెట్ అంచనాలను రూ. 2,09,982 కోట్లకు సవరించిన రాష్ట్ర ప్రభుత్వం... 2022- 23 బడ్జెట్ అంచనాలను రూ. 2,56,858 కోట్లుగా ప్రతిపాదించింది. శాసనసభకు ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రభుత్వానికి కీలకం కానుంది. భారీ బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు వ్యయం కూడా చేయాల్సిఉంది. ఇప్పటికే కొనసాగుతున్న రైతుబంధు పథకంతో పాటు ఈ ఏడాది దళితబంధు పథకానికి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించారు.
ఆ హామీల అమలు: 2022- 23 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్రంలో దళితబంధు కింద 2 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరాలన్నది సర్కార్ లక్ష్యం. రెండు పడకల గదుల ఇళ్ల పథకాన్ని కొనసాగిస్తూనే సొంత జాగాల్లో ఇండ్లు నిర్మించుకునే వారికి రూ. 3 లక్షల చొప్పున ఆర్థికసాయం చేస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 4 లక్షల ఇళ్లకు ఆర్థికసాయం చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యం. 80వేలకు పైగా కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. కొత్త ఆసరా ఫించన్లతో పాటు వృద్ధాప్యం ఫించన్ల అర్హతా వయస్సును 57 ఏళ్లకు తగ్గిస్తామన్న హామీని అమలు చేయాల్సి ఉంది. మిగిలిన రెండు దఫాల రైతు రుణమాఫీ కూడా పూర్తి కావాల్సి ఉంది. మనఊరు- మనబడి, కొత్త ఆస్పత్రులు, వైద్యకళాశాలలు, నేతన్నలకు బీమా, వివిధ కొత్త కార్యక్రమాలు, హామీలను సర్కార్ నెరవేర్చాల్సి ఉంది.
ఇదీ చదవండి: రిజిస్ట్రేషన్ల శాఖకు రికార్డు స్థాయిలో ఆదాయం