హైదరాబాద్ సరూర్‌నగర్ చెరువులో పాస్టర్ ఆఫ్ ఫారిస్ విగ్రహాల నిమజ్జనాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు.. పోలీసులతో కలిసి అడ్డుకుంటున్నారు. కేవలం మట్టి విగ్రహాలను మాత్రమే నిమజ్జనానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. కోర్టు ఆదేశాలను పాటిస్తున్నామని భక్తులు సంయమనం పాటించి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
సమాచారం లేకపోవడంపై భక్తుల ఆగ్రహం
మట్టి విగ్రహాలకు మాత్రమే అనుమతించే విషయంలో ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో భక్తులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులపై ఉందన్నారు. వినాయకుని డ్రమ్ములో నిమజ్జనం చేయడానికి కనీసం నీళ్ల సౌకర్యం కూడా లేదని భక్తులు మండిపడుతున్నారు.
బేబీ పాండ్స్‌లోనే నిమజ్జనం చేయాలి
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్‌లోనే నిమజ్జనం చేయాలని అధికారులు భక్తులకు సూచిస్తున్నారు. సరూర్‌నగర్ చెరువు వద్దకు తీసుకువచ్చిన మన్సూరాబాద్ బేబీపాండ్స్, నాగోల్‌లో ఏర్పాటు చేసిన బేబీపాండ్స్‌కు విగ్రహాలను తరలిస్తున్నారు.
ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు
హుస్సేన్‌సాగర్‌తో పాటు నగరంలోని పెద్ద చెరువుల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీవోపీ) గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వీల్లేదని గురువారం హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే అధికారులు విగ్రహాలను చెరువుల్లోకి అనుమతించడం లేదు. నగరవ్యాప్తంగా జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన వాటిలో మాత్రమే నిమజ్జనం చేసేందుకు అనుమతించనున్నారు.
మట్టి విగ్రహాలు ప్రోత్సహించేలా హైకోర్టు ఉత్తర్వులు
కొన్నేళ్లుగా మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించాలని హైకోర్టు చెబుతూ వస్తోంది. నగరంలో ప్రతిష్ఠించే గణపతుల్లో 70 శాతం హుస్సేన్‌సాగర్‌లోనే కలుపుతుంటారు. నగర వ్యాప్తంగా మరో 32 చెరువుల వద్ద నిమజ్జన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు సాగర్‌తోపాటు, ఏ చెరువుల్లోనూ పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అవకాశం లేదు. ప్రధాన చెరువులకు కాలుష్యం చేయని ప్రత్యేక ప్రాంతాల్లో కలపొచ్చని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. హుస్సేన్‌సాగర్ సమీపంలో పీవీఘాట్ తదితర ప్రాంతాల్లో మట్టి విగ్రహాలను కలపొచ్చని తెలిపింది. ఈ ఏడాది చిన్నా పెద్దా కలిపి లక్షన్నర గణపతులను ప్రతిష్ఠిస్తారని అంచనా వేస్తున్నారు. వీటన్నింటిని ఎక్కడ కలపాలన్నదే ఇప్పుడు సందేహం.
ఇదీ చూడండి: Navratri Special: ఈ గణపయ్య తొమ్మిది రోజులు తొమ్మిది రంగుల్లో దర్శనమిస్తాడట!