ఆర్‌టీ-పీసీఆర్...
ఇది కరోనా వైరస్‌ను కచ్చితంగా నిర్ధరించే పరీక్ష. ముక్కు లేదా నోటి నుంచి స్వాబ్ తీసుకుని పరీక్షిస్తారు. ఈ విధానంలో కణంలోని ఆర్‌ఎన్‌ఏని పరీక్షిస్తారు కాబట్టి ఫలితం కచ్చితంగా ఉంటుంది. పాజిటివ్ అని ప్రాథమిక పరీక్షలో తేలితే, నిర్ధరణ పరీక్ష చేస్తారు. పరీక్షకు రూ.5వేల వరకు ఖర్చవుతుంది. ఫలితం రావాలంటే ఐదారు గంటల సమయం పడుతుంది. ఈ పరీక్ష కిట్ల లభ్యత తక్కువ. ఇంతవరకు ఐసీఎంఆర్ సరఫరా చేసిన కిట్లపైనే ప్రభుత్వం ఆధారపడింది. ఐసీఎంఆర్ సుమారు 5 వేల కిట్లు ఇచ్చింది. మైల్యాబ్ సంస్థ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 7,500 కిట్ల కొనుగోలు చేసింది. అవి రెండురోజుల క్రితమే వైద్య ఆరోగ్యశాఖకు చేరాయి.
ట్రూనాట్...
ఇది క్షయవ్యాధి నిర్ధరణకు చేసే పరీక్ష. కరోనా నిర్ధారణకు ట్రూనాట్ యంత్రాలు వినియోగించవచ్చని ఐసీఎంఆర్ సూచించింది. పీసీఆర్ కంటే దీనికి ఖర్చు తక్కువ. ఏపీలో 240 ట్రూనాట్ యంత్రాలున్నాయి. 37 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి అవసరమైన కిట్లను విశాఖలోని మెడ్‌టెక్‌జోన్‌లో తయారుచేస్తున్నారు. గోవా నుంచీ కొంటున్నారు. ఈ విధానంలోనూ స్వాబ్‌లనే పరీక్షిస్తారు. ఈ పరీక్షలో కరోనా పాజిటివ్ అని తేలితే... ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష చేసి నిర్ధారిస్తారు.
ర్యాపిడ్ యాంటీబాడీ...
రక్తం నమూనాలను పరీక్షిస్తారు. పరీక్షకు రూ.700-850 వరకు ఖర్చవుతుంది. 30-45 నిమిషాల్లో ఫలితం వస్తుంది. ఇక్కడ పాజిటివ్ వచ్చినవారికి ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష చేస్తారు. కిట్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. 3 లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చారు.
కెమిలూమినిసెన్స్...
ఈ విధానంలోనూ రక్తం నమూనాలను పరీక్షిస్తారు. కిట్లు కొంతవరకు మన దేశంలో దొరుకుతున్నాయి. విదేశాల నుంచీ కొంటారు. మొత్తం ఐదు లక్షల కిట్లు కొనాలన్నది ఆలోచన. లక్ష కిట్లకు ఆర్డర్ ఇచ్చారు.
ఇదీ చదవండీ... కరోనా నుంచి బయటపడినా మళ్లీ సోకనుందా..?