రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలంలోని తట్టి అన్నారంలో సీపీఎం పార్టీ నాయకులు ఆందోళన చేశారు. గ్రామంలోని సర్వే నెంబర్ 127లో గుడిసెలు వేసిన కొందరికి మద్దతు పలికిన సీపీఎం నాయకుడు పగడాల యాదయ్య.. పేదవాళ్లు 60 గజాల జాగా కోసం గుడిసెలు వేస్తే వారిని బెదిరించి.. మహిళలపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని మండిపడ్డారు. ఇదే సర్వే నెంబర్‌లో గత 30 సంవత్సరాలుగా కొందరు భూ బకాసురులు ఫారెస్టు భూములను పట్టా భూమిగా మార్చి ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నా పట్టించుకోని అధికారులు.. ఇప్పుడు పేదలు 60 గజాల కోసం గుడెసెలు వేస్తే వారిని బెదిరించి కేసులు పెడుతున్నారన్నారు.
ఫారెస్ట్ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ చేసి కమర్షియల్ షెడ్లు, ఇళ్లు నిర్మించారో ముందుగా వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. మహిళలపై పెట్టిన కేసులను వెంటనే తొలగించాలన్నారు.
"పేదవాళ్లు 60 గజాల స్థలం కోసం గుడిసెలు వేస్తే మహిళలని చూడకుండా అక్రమ కేసులు బనాయించి.. పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం చాలా బాధాకరం. ఫారెస్ట్ అధికారులు, పోలీసు అధికారులు, డబ్బులకు ఆశపడి.. పోలీసు వాళ్లకి సంబంధం లేకున్నా అతి ఉత్సాహంతో.. అమాయక ప్రజలపై దాడులు చేస్తున్నారు. సర్వే నెంబర్ 127లో కొంతమంది భూ బకాసురులు ఫారెస్ట్ భూములు పట్టా భూమిగా దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేసుకుని ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నా.. గత 30 సంవత్సరాలుగా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోలేదు."- పగడాల యాదయ్య, సీపీఎం పార్టీ నాయకుడు.
ఇవీ చదవండి: