వంద శాతం టీకాలే లక్ష్యంగా సోమవారం నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్(covid vaccination special drive) ప్రారంభం కానుంది. జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ పరిధిలో 10 నుంచి 15 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. దీనికి సంబంధించి అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ ప్రాంతాల్లోని అన్ని గృహాలకు సరిపడా టీకాలను అందుబాటులో ఉంచనున్నట్లు సీఎస్ తెలిపారు.
ఇంటింటికి వెళ్లి
ప్రత్యేక డ్రైవ్ కోసం 175 సంచార వాహనాలు ఏర్పాటు చేశారు. గ్రేటర్ పరిధిలో 150, కంటోన్మెంట్ పరిధిలో 25 సంచార వాహనాలు సమకూర్చనున్నారు. కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయించుకున్న వారిని గుర్తించనున్నారు. ప్రతి వాహనంలో ఇద్దరు టీకా వేసే సిబ్బంది, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు. వారు టీకాలు తీసుకోని వ్యక్తులను ముందుగానే గుర్తించి ఇంటింటికీ వ్యాక్సినేషన్ చేయిస్తారు. వ్యాక్సినేషన్ తేదీ, సమయం, వివరాలను ఈ బృందాలు ప్రజలకు ముందే సంక్షిప్త సందేశం ద్వారా తెలియజేస్తాయి.
ప్రశంసా పత్రాలు
టీకాలు వేసుకున్న ఇళ్లకు ప్రత్యేక స్టిక్కర్లు అధికారులు అంటించనున్నారు. టీకాల కార్యక్రమంపై విస్తృత అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వంద శాతం టీకాలు పూర్తయిన కాలనీలకు ప్రశంసాపత్రాలను జీహెచ్ఎంసీ ఇవ్వనుంది. టీకాల ప్రత్యేక డ్రైవ్ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సీఎస్ సోమేశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: ERRABELLI: 'కేంద్ర మంత్రిగా కిషన్రెడ్డి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి'