ఆదిభట్ల మున్సిపల్ ఛైర్‌పర్సన్ కొత్త హార్థిక ఎన్నిక రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ కౌన్సిలర్లు హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ విప్‌ను ధిక్కరించినందున... కౌన్సిలర్‌గా ఆమె ఎన్నిక చెల్లదని ప్రకటించాలని పిటిషన్లో కాంగ్రెస్ కౌన్సిలర్లు జి.బాలరాజ్ గౌడ్, మర్రి నిరంజన్ రెడ్డి కోరారు. ఆదిభట్ల మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో... కొత్త హార్థిక సహా ఎనిమిది మంది కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలిచారని పేర్కొన్నారు.
విప్ ఉల్లంఘన
ఛైర్‌పర్సన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మర్రి నిరంజన్ రెడ్డికి ఓటేయాలని జారీ చేసిన విప్‌ను కొత్త హార్థిక ఉల్లంఘించి తన ఓటు తనకే వేసుకున్నారన్నారు. ఆమెపై అనర్హత విధించాలని తమ ఫిర్యాదుపై మున్సిపల్ ఎన్నికల అధికారి స్పందిస్తూ.. విప్ చట్ట ప్రకారం చెల్లదని పేర్కొన్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల అధికారి ఉత్తర్వులను రద్దు చేసి.. కొత్త హార్థికపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లో కోరారు.
హైకోర్టు నోటీసులు
పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల సంఘం, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్‌తో పాటు.. హార్థికకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 17కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: చివరి నిమిషంలో ఆదిభట్ల పురపాలిక తెరాస కైవసం