CI HELPING BOY IN PATANCHERU: జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. వాటికి ఎదురెళ్లి నిలబడినప్పుడే అనుకున్నది సాధించగలం. కష్టాలు వచ్చాయి కదా అని కుంగిపోతే ఇక జీవితాంతం కష్టాలనే అనుభవించాల్సి వస్తుంది. తండ్రి చనిపోయాడు.. తల్లి పక్షవాతంతో మంచాన పడిందని బాధతో ఇంట్లోనే ఉంటే అనుకున్నది సాధించేవాడు కాడేమో! ఏదో ఒక పనికి వెళుతూ తల్లిని బాగా చూసుకుని.. కుటుంబ బాధ్యతలను నెత్తిన వేసుకున్నాడు. ఎంతలా పని చేసినా అతని సంకల్పం మాత్రం చదువుకోవాలనే. నిరంతరం ఆ ధ్యాసతోనే ఉంటూ చివరికి ఒక మానవతావాది ద్వారా ఆ సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగింది.
శంకరయ్య, చంద్రకళ అనే దంపతులు మంచిర్యాల జిల్లా ములకల్ల గ్రామంలో నివాసం ఉండేవారు. వీరికి ఒక కుమారుడు వంశీకృష్ణ ఉండేవాడు. మంచిర్యాల జిల్లాలో పని దొరకక.. బతుకుతెరువు కోసం పటాన్చెరు వచ్చి అక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే కుమారుడిని ప్రభుత్వం పాఠశాలలో చదివించేవారు. తరగతి గదిలో ఈ విద్యార్థి చదువులోనూ, ఆటలోనూ అందరి విద్యార్థుల కన్నా ఒకమెట్టు ముందే ఉండేవాడు. నిరంతరం చదువుకోవాలనే తాపత్రయం.. తన పేదరికాన్ని చూసి ఇంకా మంచిగా చదువుకొని ఉన్నతస్థితిలోకి వెళ్దాము అనుకున్నాడు.
జీవితం అంటే ఒక చదరంగం అని తెలిసిందే కదా.. ఆ విద్యార్థికి దురదృష్టం ఎదురైంది. కూలీ పనులకు వెళుతున్న తన అమ్మ పక్షవాతం వచ్చి మంచాన పడింది. నాలుగు నెలలు తరవాత తన తండ్రి క్యాన్సర్‌తో మరణించాడు. ఇదే వంశీకృష్ణ జీవితంలో ఒక పెను విషాదాన్ని నింపింది. తల్లి పక్షవాతంలో ఉన్న.. తండ్రి పనులకు వెళుతూ చదివించాడు అనే ఒక ధైర్యం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఆ ధైర్యాన్ని కోల్పోయాడు.. ఇళ్లు గడవాలంటే తప్పనిసరిగా తానే పనికి వెళ్లాలి. దీంతో రాతి గుండె చేసుకొని మధ్యలోనే తన చదువును ఆపేశాడు.
ఏ పని దొరికితే ఆపనికి వెళుతూ.. ఇంటి దగ్గర తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ కాలం గడిపేవాడు. కానీ చదువుకోవాలనే సంకల్పం మాత్రం అతనిలో బలంగా నాటుకుపోయింది. కన్నీళ్లను బయటకు రాకుండా అలానే పని చేసేవాడు. గట్టిగా అనుకున్న దానిపై మనసు లగ్నం చేసి సంకల్పించుకుంటే.. అది కచ్చితంగా నెరవేరుతుంది. అలానే వంశీకృష్ణ చదువుకోవాలన్న..కన్న కలలు ఆ రోజు నెరవేరాయి. ఈరోజుల్లో మానవత్వం ఉంది అని నిరూపిస్తూ పటాన్చెరు సీఐ వేణుగోపాల్‌రెడ్డి ఇతనికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. పదో తరగతి వరకు తన కుటుంబ బాధ్యతలను తీసుకుంటానని సీఐ హామీ ఇచ్చారు. సీఐను ఉపాధ్యాయులు, ఆ ప్రాంత ప్రజలు అభినందించారు.
" వంశీకృష్ణ తండ్రి చనిపోయాడు. తల్లి పక్షవాతంతో ఇంటికే పరిమితం అయ్యింది. దీంతో ఈ కుర్రాడు ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే ఆపేసి పనులకు వెళ్లేవాడు. ఈ విషయం తెలుసుకొని అతని గురించి కనుక్కొని, పదో తరగతి వరకు అతని బాధ్యత, కుటుంబ బాధ్యత తీసుకున్నాను. మంచిగా చదివి ఎక్కువ మార్కులు సాధించాలని కోరుకుంటున్నాను." -వేణుగోపాల్‌రెడ్డి, సీఐ
"తండ్రి చనిపోయిన నాకు తల్లి పక్షవాతంతో ఇంట్లోనే ఉండడంతో చదువు మధ్యలోనే ఆపి పనులకు వెళ్లేవాడిని. సీఐ గారు నన్ను చదివించేందుకు ముందుకొచ్చారు. ఇక నుంచి మంచిగా చదువుకుంటాను. సీఐ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను." -వంశీకృష్ణ, విద్యార్థి
ఇవీ చదవండి: