హరితహారంలో ఆదర్శ గ్రామంగా నిలిచిన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ శ్రీరాంనగర్ ఈసారి చవితి వేడుకల్లో వరిగింజలతో తయారుచేసిన బొజ్జగణపయ్యను కొలువుదీర్చి మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. కొవిడ్ కారణంగా మొదట మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్వాహకులు భావించారు. కానీ స్థానిక యువకుడు శశిధర్ రెడ్డి తనదైన ఆలోచనతో మట్టిలో వరి గింజలను పోసి గణేశుడి ఆకారాన్ని తీర్చిదిద్దారు. అలా... పర్యావరణ హిత గణపయ్య తయారయ్యాడు. ఆ ఆకారాన్ని చూసి స్థానికులు శశిధర్ ప్రతిభను మెచ్చుకుంటున్నారు. ప్రభుత్వ సూచనల అనుగుణంగా ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు.
పచ్చదనాన్ని సంతరించుకుంది
రోజూ బొజ్జ గణపయ్యకు పూజలు చేయడంతోపాటు నీళ్లు చల్లడం మొదలుపెట్టారు. మూడురోజుల్లో వరి గింజలన్నీ మొలకెత్తాయి. క్రమంగా లంబోదరుడి రూపం పచ్చదనాన్ని సంతరించుకుంది. కరోనా విజృంభిస్తుండటంతో ప్రసాదాల వితరణతోపాటు లడ్డూ వేలంపాటను కూడా రద్దు చేశారు. అన్నదానం సహా ఇతర కార్యక్రమాలన్నీ పూర్తిగా విరమించుకున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తూ ఎకోఫ్రెండ్లీ గణేశుడికి పూజలు చేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. వరి గింజలతో తయారుచేసిన విగ్రహాన్ని పెట్టడం వల్ల ఈసారి శ్రీరామ్ నగర్ పరిధిలో సమృద్ధిగా వర్షాలు పడ్డాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నిమజ్జనం రోజున బొజ్జగణపయ్య పై మొలకెత్తిన వరినారును స్థానిక రైతులకు అందించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఆ నారును తమ పొలాల్లో వేసుకుంటే మంచి దిగుబడి వస్తుందని శ్రీరామ్ నగర్ వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి : అమ్మాయిల వివాహ వయసు పెంచే యోచనలో కేంద్రం