Rythu Avedana Yatra in Sircilla: వరి పంట వేయొద్దనే హక్కు ముఖ్యమంత్రి కేసీఆర్కు లేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. 'రైతు ఆవేదన యాత్ర'లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముచ్చర్ల గ్రామంలో ఆమె పర్యటించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు రాగుల దేవయ్య కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.
చేతకాక దిల్లీలో డ్రామాలు...
వరి పంట వేసుకుంటే మద్దతు ధర వస్తుందన్న భరోసాతోనే రైతు వరి పంట వేసుకుంటారని షర్మిల అన్నారు. అలాంటి వరి పంటను వేయకూడదనే హక్కు ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి పాలన చేతకాక దిల్లీకి మంత్రులను పంపించి డ్రామాలాడుతున్నారని విమర్శించారు. వరి వద్దనే ముఖ్యమంత్రి మనకు వద్దనే నినాదంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
ఆత్మహత్యలకు కేసీఆరే కారణం..
రాష్ట్రంలో ఇప్పటి వరకు 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వైఎస్ షర్మిల తెలిపారు. ఈ అన్నదాతల ఆత్మహత్యలకు కేసీఆరే కారణమని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అందరికీ పింఛన్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకునే సీఎం కేసీఆర్కు ఇంత మంది అర్హులున్నా కనిపించడంలేదా అని షర్మిల ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా నోటిఫికేషన్లు ఇవ్వలేదని ఆమె దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: Clap Motor Nagarkurnool : చప్పట్లు కొడితే.. ఈ మోటార్ ఆన్ అవుతుంది