మధ్య మానేరు ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించాకే రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ అడుగుపెట్టాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. అలా చేయకుండానే.. జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రారంభోత్సవానికి రావాలనుకుంటే కాంగ్రెస్ పక్షాన నిరసన తప్పదని హెచ్చరించారు.
హామీలు నెరవేర్చాలి..
సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం పొన్నం నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు.. కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 100 కోట్లు కేటాయించి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
ఇంజనీర్ల నిర్లక్ష్యం..
మధ్య మానేరు జలాశయం వద్ద నిర్మించిన కరకట్ట నుంచి పంట పొలాల్లోకి నీరు చేరుతోందని, ఇంజనీర్ల నిర్లక్ష్యంతోనే అలా జరుగుతోందని ఆరోపించారు. వందల ఎకరాల్లో రైతులు నష్టపోతున్నారని అన్నారు. వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
దసరా వరకు అప్పర్ మానేరు పనులు పూర్తిచేసి జిల్లాకు సాగునీరు అందిస్తామన్న కేటీఆర్ మాట తప్పారు. ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించాకే సిరిసిల్లలో కేసీఆర్ అడుగుపెట్టాలి. లేదంటే నిరసన తప్పదు. అక్రమ అరెస్టు ద్వారా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఇంటి నుంచే నిరసన చేపడతాం.
-పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
ఇదీ చూడండి: ధాన్యం కొనుగోలు కేంద్రాల ఎత్తివేతపై పొన్నం ఆందోళన