రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో సుమారు వెయ్యి కోళ్లు మృతి చెందాయి. మేడారం జాతర సందర్భంగా గత 15 రోజులుగా వేములవాడ రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. అయితే మేడారం సమ్మక్క దర్శనం కంటే ముందుగా వేములవాడ రాజన్న దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో రాజన్న దర్శనానంతరం భక్తులు బద్ది పోచమ్మ అమ్మవారికి బోనంతో పాటు కోళ్లు, గొర్లను మొక్కుల రూపంలో చెల్లిస్తుంటారు.
ఆలయ పరిసరాల్లో వెలసిన చికెన్ సెంటర్ల వ్యాపారులకు నిన్న కోళ్ల ఫాం వారు కోళ్లను సరఫరా చేశారు. తెల్లవారు జామున పలు చికెన్ సెంటర్లల్లో సుమారు వెయ్యి కోళ్లు మృతి చెందగా... తీవ్రంగా నష్టపోయామని వ్యాపారులు వాపోయారు. ఇదిలా ఉండగా ఏదో వైరస్ ఎఫెక్ట్‌తోనే ఇలా కోళ్లు మృతి చెందినట్లు భావిస్తున్నామన్నారు. మరో వైపు భక్తులు కూడా భయాందోనలకు గురి అవుతున్నారు. మున్సిపల్ అధికారులు వచ్చి మృతి చెందిన కోళ్లను తరలించారు.
ఇవీ చూడండి: అసత్య ప్రచారాలు చేయొద్దు: ఈటల